మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (12:01 IST)

జో బైడెన్ అదుర్స్... ట్రంప్ పాలసీలకు గండికొట్టారు.. కీలక ఆదేశాలపై సంతకాలు

అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జో బైడెన్‌.. మాజీ అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ పాలసీలను వెనక్కి తీసుకున్నారు. తొలిరోజే 15 కీలక కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేశారు. ట్రంప్‌ పాలనలో విసిగిపోయి.. బైడెన్‌కు గొప్ప విజయాన్ని అందించిన ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నూతన అధ్యక్షుడు వివరించారు. 
 
కరోనా మహమ్మారి నియంత్రణకు సంబంధించి తొలుత చర్యలు తీసుకున్నారు. పౌరులంతా వంద రోజుల పాటు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా ఛాలెంజ్‌ విసిరారు. మహమ్మారి స్థితిగతులపై ఎప్పటికప్పుడు అధ్యక్షుడికి సమాచారం అందించేలా ‘కొవిడ్‌-19 రెస్పాన్స్‌ కోఆర్డినేటర్‌’ పోస్టును సృష్టిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇందులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి అమెరికా వైదొలగుతూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపేశారు. సాంక్రమిక వ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌసీ నేతృత్వంలోని బృందం డబ్ల్యూహెచ్‌వో సమావేశాలకు ఇకపై ప్రాతినిధ్యం వహించనుంది. గ్రీన్‌ కార్డుల జారీపై దేశాలవారీ పరిమితిని నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ ఉపసంహరించారు. బాల్యంలోనే అమెరికాకు వలస వచ్చి.. దేశాభివృద్ధిలో భాగస్వామ్యమైన వారికి శాశ్వత నివాసం/పౌరసత్వం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు.
 
ముస్లిం దేశాలకు రాకపోకలపై ట్రంప్‌ విధించిన నిషేధాన్ని బైడెన్‌ ఎత్తివేశారు.  ట్రంప్‌ మానసపుత్రికగా పిలిచే మెక్సికో గోడ నిర్మాణం నిమిత్తం నిధుల సమీకరణకు గత సర్కారు తీసుకొచ్చిన నేషనల్‌ ఎమర్జెన్సీ డిక్లరేషన్‌ నిలిపేశారు.   
 
ఇంకా డొనాల్డ్ ట్రంప్‌ హయాంలో అమెరికా పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ పారిస్‌ వాతావరణ ఒప్పందంలో అమెరికాను మళ్లీ భాగస్వామ్యం చేస్తూ సంతకం చేశారు. దీంతో కాలుష్య నియంత్రణకు చర్యలతో పాటు ఈ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఆమోదం లభించినట్లయింది.  
 
జాతి వివక్ష నిర్మూలన దిశగా... బ్లాక్‌, లాటినో, నేటివ్‌, ఏషియన్‌, పసిఫిక్‌ ద్వీపాల, ఎల్‌జీబీటీక్యూ, మతపరమైన మైనార్టీ వ్యక్తులకు సమాన హక్కులను నిర్వచిస్తూ ఉత్తర్వులు జారీ చేసేలా బైడెన్‌ సంతకం చేశారు.