శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (10:32 IST)

ప్రపంచానికి జలగండం!?

శరవేగంతో సంభవిస్తున్న వాతావరణ మార్పుల ప్రభావం సహజ వనరులపై గణనీయంగా పడటంవల్ల ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రస్తుత ప్రపంచ జనాభా సుమారుగా 780 కోట్లు. అందులో 220 కోట్లమందికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదు. 
 
420 కోట్లమందికి సరైన పారిశుద్ధ్య పరిస్థితులూ లేవు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక(2020) ప్రకారం నానాటికి వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల ప్రభావం నీటి లభ్యత, నాణ్యతలపై తీవ్రస్థాయిలో ప్రసరిస్తుందని హెచ్చరించింది. 
 
ఐరాస నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా ప్రపంచ దేశాలు దృఢసంకల్పంతో అడుగులు వేయకపోతే 2030నాటికి అందరికీ రక్షిత తాగునీరు, పారిశుద్ధ్య పరిస్థితులు కల్పించాలన్న ఆశయం సాకారంకాదని హెచ్చరించింది.
 
గడచిన వందేళ్లలో నీటి వినియోగం ఆరు రెట్లు పెరిగింది. జనాభా జోరెత్తుతోంది. ఆపై వాతావరణ మార్పులు శాపాలై తీవ్రమైన తుపానులు, వరదలు, కరవులు ప్రపంచ దేశాలను వేధిస్తున్నాయి. వీటి ఫలితంగా నీటిపై ఒత్తిడి గణనీయంగా పెరిగింది. 
 
వాస్తవానికి అనేక దేశాలు నీటి సంక్షోభం అధికస్థాయిలో ఎదుర్కొంటున్న తరుణమిది. ప్రపంచ వనరుల సంస్థ (2019) లెక్కల ప్రకారం అధిక స్థాయిలో నీటిఎద్దడిని ఎదుర్కొంటున్న దేశాల్లో కతర్‌ మొదటిస్థానంలో, భారత్‌ 13వ స్థానంలో ఉన్నాయి. 
 
తక్కువ ఎక్కువ తేడాలే తప్ప భవిష్యత్తులో అన్ని ప్రపంచ దేశాలు నీటిఎద్దడి బారినపడటం ఖాయమని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. కాబట్టి నీటిఎద్దడి అనేది ప్రపంచ దేశాల ఉమ్మడి సమస్యగా మారింది. 
 
మొత్తం నీటి అవసరాల్లో 69శాతం వ్యవసాయమే వినియోగించుకుంటోంది. పరిశ్రమలు, ఇంధన ఉత్పత్తులు, మత్స్యసంపద వంటి రంగాలపైనా నీటిఎద్దడి దుష్ప్రభావం పడుతుంది. 
 
ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ పర్యావరణం విషయంలో పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ఇప్పటికే కాలతీతం అయిందని ఐరాసకు చెందిన వ్యవసాయాభివృద్ధి అంతర్జాతీయ నిధి నివేదిక సైతం వాపోయింది.
 
వాతావరణ మార్పుల ప్రభావంవల్ల నీటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఫలితంగా ప్రాణవాయువు శాతం తరిగి నీటి నాణ్యతలో మార్పులు వస్తాయి. 
 
సహజ నీటి మడుగులు, సరస్సులు తమ స్వీయ శుద్ధీకరణ సామర్థ్యాన్ని కోల్పోతాయి. కరవు కాటకాల సమయాల్లో కాలుష్య కారకాలు పెచ్చరిల్లి, నీరు కలుషితం అవుతుంది.