1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 జూన్ 2020 (19:50 IST)

సహాయం చేయండి ప్లీజ్: ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో విద్యాశాఖ మంత్రి

ఉపాధ్యాయ శిక్షణ, బోధన విధానాల రూపకల్పన, మూల్యంకనం, మానవ వనరుల శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రపంచ బ్యాంకు సహకారాన్ని కోరుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.

శుక్రవారం సమగ్ర శిక్షా కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు షబ్నం సిన్హా, కార్తిక్ పెంటల్, నీల్ బూచర్‌లతో  ‘ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా అభివృద్ధి పథకం (ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్‌ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు)’ పై వెబినార్ సమావేశం జరిగింది. ఈ వెబినార్‌కు విద్యాశాఖా మంత్రి ఆదిమూల‌పు సురేష్ సచివాలయంలోని తన పేషీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించారు.

ఈయనతో పాటు రాష్ట్రం నుంచి పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, ఆంగ్లమాధ్యమ ప్రత్యేక అధికారిణి కె.వెట్రిసెల్వి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి, సమగ్ర శిక్షా ఏఎస్పీడీ ఆర్.మధుసూదనరెడ్డి, పాఠశాల విద్య సలహాదారులు డాక్టర్ ఎ.మురళి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలకు పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్ర బడ్జెట్టులో 16శాతం నిధులు విద్యారంగానికి కేటాయించామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. మానవ వనరులు, భౌతిక వనరుల కల్పన ద్వారా నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నామని తెలిపారు.

విద్యాలయాలకు, పరిశ్రమలకు అనుసంధానం కల్పించడం అవసరమని పేర్కొన్నారు. నిరుద్యోగతకు కారణం నైపుణ్యం లేని విద్య అంటూ పట్టభద్రులు పరిశ్రమలలో ఇంటర్నర్‌షిప్‌లో పాల్గొనడం ద్వారా ఉపాధి నైపుణ్యాలను పొందగలగుతారని పేర్కొన్నారు. బోధన విధానం, తరగతి నిర్వహణ, మూల్యంకనం వంటి అంశాల్లో పెద్ద ఎత్తున మార్పునకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

రాష్ట్రాన్ని విద్యారంగంలో దేశానికే ఆదర్శంగా నిలపడానికి ‘మన బడి, నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో భాగంగా సమగ్ర శిక్షా, పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను విద్యాశాఖ ఉన్నతాధికారులు వివరించారు.