అమెరికన్ ఫోర్బ్స్ జాబితాలో ప.గో అమ్మాయి.. 75 దేశాలతో పోటీపడి...
ప్రతిష్టాత్మక మేగజైన్ ఫోర్బ్స్‌లో ఆంధ్రా అమ్మాయి మెరిసింది. అమెరికన్ ఫోర్బ్స్ మేగజైన్ అండర్ -30 శాస్త్రవేత్త విభాగంలో ఆమెకు చోటుదక్కింది. ఆ అమ్మాయి పేరు మేఘన. ఊరు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి. నవంబరు నెలలో ప్రచురించిన ఫోర్బ్స్ మేగజైన్‌లో ఆమె ఈ ఘనతను సాధించింది.
గత 2018 మే నెలలో ఐసెఫ్ (ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్టు) అవార్డును ఆమె దక్కించుకున్నారు. దీంతో అత్యంత ప్రతిభాశాలిగా మేఘనను గుర్తించారు. ఇందుకోసం ఆమె ఏకంగా 75 దేశాలతో పోటీపడి గెలిచింది. ఈ మేగజైన్‌లో చోటు సంపాదించడంతో అటు అమెరికాలో, భారత్‌లో అభినందలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, మేఘన తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని ఆర్క్‌నెస్ స్టేట్ లిటిల్ రాక్‌లో ఉంటున్నారు. సైన్స్ అంటే ఆసక్తి ఉండే మేఘన 2018లో ప్రపంచ స్ధాయిలో ఐసెఫ్ నిర్వహించిన సైన్స్‌ఫేర్ పోటీల్లో ఎలక్ట్రోడ్ మేడ్ విత్ ప్లాటినమ్ అనే సైన్స్ సూపర్ కెపాసిటర్ ప్రయోగాన్ని ప్రదర్శించారు. ఈ పోటీల్లో మొత్తం 75 దేశాల యువ శాస్త్రవేత్తలు పోటీపడ్డారు. ఈ పోటీల్లో ఆమె గెలుపొందడంతో ఆమెకు 50 వేల డాలర్లను బహుమతిగా అందజేశారు. ఫలితంగా ఆమెకు ఈ ఘనత దక్కింది.