నాగశౌర్య కథానాయకుడిగా రమేష్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'అబ్బాయితో అమ్మాయి'. జనవరి 1న విడుదలైన ఈ చిత్రంతో ముంబై ముద్దుగుమ్మ పల్లక్ లల్వాని కథానాయికగా పరిచయమైంది. ప్రస్తుతం ముంబైలో బిఎ చదువుతున్న ఆమెకు అనుకోకుండా ఇందులో అవకాశం వచ్చింది. తొలి చిత్రంలోనే ముద్దు సన్నివేశాలు, బెడ్‌రూమ్ సీన్లు చేయడం కష్టమైనా.. పాత్రలే ఆ పనిచేశాయనీ, తాము కాదని తెలివిగా సమాధానం చెబుతుంది. ఈ సందర్భంగా ఆమెతో చిట్‌చాట్.
థియేటర్లలో సినిమాను చూశారా?
హైదరాబాద్‌లో కొన్ని థియేటర్లలో చూశాను. మొదటి చిత్రమిది. అయినా, ఈ అమ్మాయి బాగా నటించిందంటూ ప్రేక్షకులు చెప్తున్నారు. నాకు లభించిన అతిపెద్ద ప్రశంస ఇదే. నా వరకూ ప్రతిభే ముఖ్యమని నమ్ముతాను. ఇక్కడ ఓ అందాల బొమ్మగా మిగలాలని అనుకోవడం లేదు.
ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?
గతంలో ఓ సౌత్ మూవీ కోసం ఆడిషన్ చేశాను. దర్శకుడు రమేష్ వర్మ నా ఫోటోలను చూశారు. తర్వాత ముంబై వచ్చి కలిశారు. నాతోపాటు అమ్మకు స్క్రిప్ట్ వినిపించారు. ప్రార్థన పాత్రలో నటించేలా ఆయనే ఒప్పించారు.
నటనలో శిక్షణ తీసుకున్నారా?
లేదండీ. ప్రస్తుతం ముంబై జైహింద్ కళాశాలలో డిగ్రీ(బిఏ) చదువుతున్నాను. నాన్న జితిన్ లల్వాని పలు హిందీ సీరియళ్లు, నాటకాలలో నటించారు. నటన అంటే ఆసక్తి ఏర్పడింది.
సినిమాలో మాదిరి ఫేస్‌బుక్‌లో బుక్ అయ్యారా?
నేను 9వ తరగతిలో ఉండగా ఫేస్‌బుక్ వచ్చింది. అప్పట్లో ఫేస్‌బుక్ ఖాతా ఉండేది. అందరిలా నేను కూడా చాటింగ్ చేసేదాన్ని. అజ్ఞాత వ్యక్తులు ఓ పదిమందితో చాటింగ్ చేశా. ఈ చిత్రంలో ప్రార్ధన విషయంలో జరిగిందదే. అందుకే దాన్నుంచి తప్పుకున్నా. ప్రస్తుతం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎక్కువ యాక్టివ్‌గా లేను.
శృంగార సన్నివేశాలలో నటించడం కష్టంగా అనిపించిందా?
వ్యక్తిగతంగా కష్టమే. కానీ, చిత్రంలో పల్లక్, శౌర్యను ముద్దు పెట్టుకోవడం లేదు. పాత్రలైన ప్రార్థన, అభిలు ముద్దు పెట్టుకున్నారంతే. అక్కడితో సన్నివేశం పూర్తయింది. నాగశౌర్యతో ముద్దు సన్నివేశాల్లో నటించడం పెద్ద కష్టంగా ఫీలవలేదు. అప్పటికి మీమిద్దరం స్నేహితులయ్యాం. మంచి వ్యక్తి, చాలా సహజంగా నటిస్తాడు. శౌర్యతో సౌకర్యవంతంగా కిస్, రొమాంటిక్ సన్నివేశాలను పూర్తిచేశా.
డైలాగ్‌లు కష్టమనిపించలేదా?
ముంబైలో పెరిగాను, అమ్మ పంజాబీ. దక్షిణాది భాషల గురించి అవగాహన లేదు. నార్త్ ఇండియన్స్ అందరూ.. దక్షిణాది భాష ఒక్కటే అనుకుంటారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ.. వేర్వేరు భాషలని ఈ చిత్రంలో నటించిన తర్వాత అర్థమైంది. చిత్రీకరణలో నా డైలాగులను బట్టీపట్టాను. యూనిట్ సభ్యులందరూ ఎంతో సహాయం చేశారు.
తెలుగు సినిమాలు చూస్తారా?
నేను ఎక్కువ తెలుగు సినిమాలు చూడలేదు. 'బొమ్మరిల్లు'.. నేను చూసిన మొదటి తెలుగు సినిమా. జెనీలియా నటనతో ప్రేమలో పడ్డాను. ఇటీవల 'ఓకే బంగారం' చూశా. దుల్కర్ సల్మాన్ బాగా నచ్చాడు, నా ఫేవరెట్ అయ్యాడు.
తెలుగులో ఎవరితో నటించాలనుకుంటున్నారు?
మహేష్ బాబు.. ఆల్ టైం ఫేవరెట్ హీరో. మీరు ఎవరితో నటిస్తారు? అని ప్రశ్నిస్తే, ముందు మహేష్ బాబు పేరు చెప్తాను. నా ప్రాధన్యత మహేషే. తర్వాత చాలామంది స్టార్ హీరోలున్నారు. అందరితో నటిస్తానని తెలిపారు.