శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 27 మార్చి 2017 (18:25 IST)

జీవితాన్ని మార్చే మొత్తం: ఉక్కిరిబిక్కిరవుతున్న బెన్ స్టోక్స్

తంతే బూర్లగంపలో పడ్డాడు అనేది పాత మాట. తంతే ఐపీఎల్‌లో వచ్చి పడ్డాడన్నది నేటి మాట. కొందరు క్రికెటర్లు జీవితకాలం మొత్తం కూడా సంపాదించలేనంత డబ్బును ఐపీఎల్ పిలిచి మరీ చేతిలో పెడుతోంది.

తంతే బూర్లగంపలో పడ్డాడు అనేది పాత మాట. తంతే ఐపీఎల్‌లో వచ్చి పడ్డాడన్నది నేటి మాట. కొందరు క్రికెటర్లు జీవితకాలం మొత్తం కూడా సంపాదించలేనంత డబ్బును ఐపీఎల్ పిలిచి మరీ చేతిలో పెడుతోంది. దీని ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే ఆటగాళ్లు వేలంలో తమను పాడుకున్న ధర చూసి ఉక్కిరిబిక్కిరయ్యేంతగా ఉంటోంది. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. 
 
ఇటీవలి భారత్‌ పర్యటనలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ తన సూపర్‌ షోతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌–10 ఆటగాళ్ల వేలంలో తను హాట్‌కేకులా మారతాడని ముందే అందరూ ఊహించారు. అయితే ఇతడిపై ఏకంగా రూ.14.5 కోట్ల రికార్డు ధరను వెచ్చించి కొనుగోలు చేస్తారని మాత్రం అనుకోలేదు. నిజానికి ఈ ధర అటు స్టోక్స్‌ను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎందుకంటే ఇది ఇప్పటిదాకా ఓ విదేశీ ఆటగాడికి దక్కిన అత్యధిక మొత్తం. అటు ఈ వేలాన్ని చూసేందుకు తెల్లవారుజామున 3.30 గంటలకే అలారం పెట్టుకుని లేచానని రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఆడబోతున్న స్టోక్స్‌ తెలిపాడు. 
 
‘వేలం కోసం ఉత్సాహంగా తెల్లవారే అలారం పెట్టుకుని లేచాను. నా వంతు వచ్చేవరకు 40 నిమిషాలసేపు ఓపిగ్గా ఎదురుచూశాను. అయితే టీవీలో ప్రత్యక్షంగా చూడలేకపోయాను. అందుకే ట్విట్టర్‌లో ఫాలో అయ్యాను. ఎప్పటికప్పుడు ట్వీట్స్‌ను అప్‌డేట్‌ చేస్తుంటే తెలిసింది.. నన్ను పుణే జట్టు తీసుకుందని. నా కనీస ధరకు ఏడు రెట్లు ఎక్కువగా లభించడంతో ఆశ్చర్యపోయాను. దీనిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. నిజంగా ఇది జీవితాన్ని మార్చే మొత్తం. ఇంతకుమించి ఆశించలేను. ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు. అయితే నా ధరకు తగ్గట్టుగా ఆడి జట్టుకు విజయాలు అందించాలనుకుంటున్నాను’ అని స్టోక్స్‌ సంతోషం వ్యక్తం చేశాడు.