పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ఫెయిల్
పనస పండు కారణంగా కొంతమంది ఆర్టీసీ బస్ డ్రైవర్లకు వింత అనుభవం ఎదురైంది. పనస పండు తినటం వల్ల వారు బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ఫెయిల్ అయ్యారు. దీంతో డిపోలో పెద్ద రచ్చే జరిగింది. వివరాల్లోకి వెళితే.. గతవారం పాతానమ్‌తిట్టలోని కేఎస్‌ఆర్టీసీ డిపార్ట్‌మెంట్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న కొంతమంది డ్యూటీ ఎక్కడానికి ముందు పనస పండు తిన్నారు. ఆ వెంటనే బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు హాజరయ్యారు.
బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ఆల్కహాల్ లెవెల్ 0 నుంచి ఏకంగా పదికి ఎగబాకింది. దీంతో వారు షాక్ అయ్యారు. తాము మందు తాగలేదని, కావాలంటే రక్త పరీక్షలు చేయమని స్పష్టం చేశారు. మొత్తం నలుగురు డ్రైవర్లు బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ఫెయిల్ అయ్యారు. దీంతో ఏం జరిగిందో తెలియక గందరగోళానికి గురయ్యారు. టెస్టులకు ముందు ఏం తిన్నారని వారిని అడిగారు. పనస పండు తిన్నామని చెప్పారు. దీంతో అధికారులు టెస్టుకు సిద్ధమయ్యారు. పనస పండు తినని వారిపై బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయించారు.
రీడింగ్ జీరో చూపించింది. తర్వాత వారితో పనస పండు తినిపించారు. ఆశ్చర్యకరంగా బ్రీత్ అనలైజర్‌లో వాళ్లు ఆల్కహాల్ తీసుకున్నట్లు చూపించింది. పనస పండులో పులిసిన పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని ఎక్కువగా తిన్నట్లయితే.. కొద్ది మొత్తంలో ఇథనాల్ మన శరీరంలోకి చేరుతుంది. పనస పండులోని చక్కెరల కారణంగా కూడా బ్రీత్ ఎనలైజర్ ఆల్కహాల్ తీసుకున్నట్లు చూపిస్తుంది. ఇకపోతే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై మీమర్స్ వీడియోలు అప్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు.