గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (19:43 IST)

జియోకు పోటీగా ఎయిర్‌టెల్ : క్వాల్‌కమ్‌తో కలిసి 5జీ సేవలు

దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలికాం సంస్థలు పోటీపడుతున్నాయి. ఇటీవలే జియో సంస్థ 5జీని తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. మరో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కూడా 5జీపై దృష్టి సారించింది.
 
భారత్‌లోకి 5జీ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు అమెరికన్ టెక్ సంస్థ క్వాల్‌కమ్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. దీని కోసం క్వాల్‌కమ్‌కు చెందిన రేడియో యాక్సెస్ నెట్‌వర్క్(ర్యాన్) ప్లాట్‌ఫాంలను వినియోగించనున్నట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది.
 
ఇదిలా ఉంటే భారత్‌లో తొలిసారి 5జీని పరీక్షించిన టెలికం సంస్థగా ఎయిర్‌టెల్ సంస్థ ఈ మధ్యనే రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో ఓ లైవ్ అడ్వర్టైజ్‌మెంట్‌ను 5జీ ద్వారా ప్రసారం చేసి విజయం సాధించింది. ఈ విజయంతోనే క్వాల్‌కమ్ సాయంతో 5జీ బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా ప్రారంభించాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది. 
 
దీనికోసం 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) ద్వారా గిగాబైట్ స్పీడ్‌లో ఇంటర్నెట్ స్పీడ్‌ను అందించేందుకూ ప్రణాళికలు రచిస్తోంది. దీనిని బట్టి 4జీ సేవల్లో భారీ వినియోగదారులను సొంతం చేసుకున్న జియోకు ఎయిర్ టెల్ గట్టి పోటీ ఇవ్వనుందని.. 5జీ సేవలను కస్టమర్లకు అందించేందుకు ఎయిర్ టెల్ పక్కా ప్లాన్ వేస్తుందని ఐటీ నిపుణులు చెప్తున్నారు.