శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్

రూ.599 ప్లాన్‌తో రూ.4 లక్షల జీవిత బీమా.. ఎయిర్‌టెల్ నయా ప్లాన్

ప్రైవేట్ టెలికాం కంపెనీ ఎయిర్‍టెల్ తాజాగా మరో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.599 ప్లాన్‌తో రీచార్చ్ చేసుకుంటే రూ.4 లక్షలకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించనుంది. ఇందుకోసం భారతీ ఆక్సా లైఫ్ బీమా కంపెనీతో ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. 
 
ఇదే అంశంపై ఆ సంస్థ అధికారిణి వాణి వెంకటేశ్ మీడియాతో మాట్లాడుతూ, 'ఈ కొత్త ప్లాన్‌లో రూ.599 తో రీఛార్జ్ చేసుకుంటే ప్రతీరోజు 2 జీబీ డేటా, ఏ నెట్ వర్క్ కైనా అపరిమిత కాల్స్ చేసుకునే వీలు, రోజుకు 100 సంక్షిప్త సందేశాలు పంపుకునేందుకు అవకాశముంటుంది. 
 
దీని కాలపరిమితి 84రోజులు. వీటికి అదనంగా వినియోగదారులు రూ.4 లక్షల విలువైన జీవిత బీమా సౌకర్యం కూడా పొందుతారు. దీని కాలపరిమితి మూడు నెలలు ఉంటుంది. రీచార్జ్ చేసుకున్న ప్రతీసారి బీమా కాలపరిమితి పొడిగించబడుతుంది.
 
18 ఏళ్ల నుంచి 54 ఏళ్ల వయసున్నవారు ఈ పథకంలో చేరవచ్చు. ఇందుకు ఎలాంటి పత్రాలు, ఆరోగ్య ప్రమాణ పత్రాలు సమర్పించవలసిన పనిలేదు. డిజిటల్ రూపంలో ఇన్సూరెన్స్ పత్రాలు వినియోగదారుడికి అందుతాయి అని ఆమె తెలిపారు.