శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జులై 2020 (13:27 IST)

ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగింపు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలోనూ రోజూ రోజుకీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. చాలావరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాయి. తాజాగా కేంద్రం మరోసారి ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 
 
ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని డిసెంబర్ 31వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో మరికొన్ని నెలల పాటు 'వర్క్ ఫ్రం హోం' సౌకర్యాన్ని కేంద్రం పొడిగించింది.
 
గతంలో విధించిన గడువు జూలై 31తో ముగుస్తున్న తరుణంలో... కోవిడ్‌-19 కారణంగా ప్రజల్లో నెలకొన్న భయాందోళనను దృష్టిలో ఉంచుకొని ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని 2020 డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ సర్వీసు ప్రొవైడర్లకు నిబంధనలు, షరతులలో డాట్‌ సడలింపులు ఇచ్చిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ట్వీట్‌ చేసింది.
 
భారత్‌లో ప్రస్తుతం 85శాతం మంది ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆఫీసులకు వెళ్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఐటీ ఉద్యోగులు కరోనా ముప్పు నుంచి తప్పుకోవచ్చునని ఐటీ శాఖ భావిస్తోంది.