శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జులై 2020 (11:48 IST)

72 గంటల్లో కస్టమర్ల సమాచారం అందివ్వాలి : ఈ-కామర్స్ దిగ్గజాలకు కేంద్రం

దేశంలో ఈ-కామర్స్ సేవలు అందిస్తున్న కంపెనీలకు కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. వచ్చే 72 గంటల్లో ప్రతి కష్టమర్ పూర్తిసమచారాన్ని ఇవ్వాలంటూ ఆదేశించింది. ఈ మేరకు అమెజాన్, గూగుల్ సహా ఇతర అన్ని ఈ-కామర్స్ దిగ్గజాలకు ఆదేశాలు జారీచేసింది. 
 
పైగా, ఈ ఈ-కామర్స్ కంపెనీలన్నీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని, వారి వద్ద ఉన్న కస్టమర్ల సమస్త సమాచారాన్నీ, ప్రభుత్వానికి 72 గంటల్లోగా అందించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తాఖీదులు జారీ చేసింది. జాతీయ భద్రత, పన్ను చెల్లింపులు, లా అండ్ ఆర్డర్ ముడిపడివున్న ఈ అంశంలో వెనక్కు తగ్గేది లేదని స్పష్టంచేసింది. 
 
ఈ మేరకు సరికొత్త ఈ-కామర్స్ పాలసీ ముసాయిదాను విడుదల చేసింది. స్థానిక, అంతర్జాతీయ కంపెనదీలు తమ వద్ద ఉన్న డేటాను ఎలా వినియోగిస్తున్నాయో తెలుసుకునే అవసరం కేంద్రానికి ఉందని పేర్కొంది.
 
కేంద్ర వాణిజ్య శాఖ అధీనంలోని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఈ ముసాయిదాను తయారు చేసింది. ఈ ముసాయిదా ప్రకారం ఆన్‌లైన్ కంపెనీల సోర్స్ కోడ్, ఆల్గోరిథమ్స్‌ను ప్రభుత్వం యాక్సెస్ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు, వారు వాడుతున్న కృత్రిమ మేథస్సు వివరాలను కూడా కేంద్రానికి అందించాల్సి వుంటుంది. 
 
ఇప్పటికే దేశంలో డిజిటల్ ఎకానమీ ఊపందుకోవడం, దాదాపు 100 కోట్ల మంది ఏదో ఒకవిధంగా డిజిటల్ మాధ్యమాలను వినియోగిస్తుండటంతో, పలు అంతర్జాతీయ కంపెనీలు ఇండియాలో కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో డిజిటల్ లావాదేవీలపై కూడా కేంద్రం దృష్టిసారించింది. 
 
డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ పుంజుకోవడంతో, అంతే మొత్తంలో మోసాలు కూడా పెరిగాయి. ఇదే సమయంలో స్థానిక స్టార్టప్ సంస్థలు, తమకు ప్రభుత్వ సహకారం కావాలని కోరుతున్నాయి. ఇటీవలే చైనా దిగ్గజ సాంకేతిక కంపెనీలకు చెందిన యాప్స్ నిషేధించిన నేపథ్యంలో, భారత కంపెనీల యాప్స్‌కు మద్దతు పెరిగింది. దీంతో కేంద్రం గట్టి నిఘా వేసింది. 
 
ఈ-కామర్స్ సంస్థలు తమకు వస్తువులను అందించే వారందరి వివరాలను ఫోన్ నంబర్లతో సహా ఇవ్వాలని, కస్టమర్లు ఇప్పటివరకూ చేసిన ఫిర్యాదుల తాలూకు వివరాలు, వారి ఈ-మెయిల్ ఐడీలు, చిరునామాలను కూడా సమర్పించాల్సి వుంటుందని కేంద్రం ఈ ముసాయిదాలో స్పష్టం చేసింది. 
 
దిగుమతి చేసుకున్న వస్తు ఉత్పత్తులైతే, ఏ దేశం నుంచి ఎప్పుడు వచ్చాయన్న విషయాన్ని స్పష్టం చేయాలని పేర్కొంది. కేంద్రం తీసుకువచ్చిన ఈ ముసాయిదాపై ఈ-కామర్స్ కంపెనీలు ఇంకా స్పందించలేదు. కానీ, కేంద్రం మాత్రం 72 గంటల్లో పూర్తి వివరాలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.