మళ్లీ పుంజుకున్న ఐటీ రంగం.. 2030 నాటికి ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు
ఐటీ రంగం మళ్లీ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. భారత్‌లో ముఖ్యంగా ఐటీలోని సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ ఇండస్ట్రీ మరింత వృద్ధి చెందుతోంది. దీనిపై ఆధారపడి వెయ్యికిపైగా స్టార్టప్‌లు ఉన్నాయి. అంతేకాదు దీనిపై ఆధారపడి పది భారీ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. మొత్తంగా ఈ సంస్థలు ఏడాదికి మూడు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందుతున్నాయి.
2030 నాటికి ఎస్‌ఏఏఎస్‌లో ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఐటీలోని ఈ విభాగంలో 40వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 2030 నాటికి దేశంలో ఎస్‌ఏఏఎస్‌ల విలువ 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా'' అని నివేదిక స్పష్టం చేసింది.
ఇప్పటికే యువ పారిశ్రామికవేత్తలు వేలాది స్టార్టప్‌లను స్థాపించి సాఫ్ట్‌వేర్ సేవలు అందిస్తున్నారు. క్లౌడ్ ద్వారా ఇవి సబ్‌స్క్రిప్షన్ సర్వీసులుగా ఉన్నాయి. ఈ కోవలోకి చెందిన భారత సంస్థ చార్జ్‌బీ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. సవాళ్లను పక్కనపెడితే ఎస్‌ఏఏఎస్ వేగంగా అభివృద్ధి చెసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
ఈ రంగం వార్షిక వృద్ధి రేటు ప్రస్తుతం ఎనిమిది శాతంగా ఉందని, మొత్తం ఐటీ మార్కెట్ కంటే ఇది రెట్టింపు అని స్పష్టం చేసింది. మొదట టాలెంట్ ఉన్నా… పెట్టుబడులు పెట్టలేక స్టార్టప్ కంపెనీ యువపారిశ్రామిక వేత్తలు చాలా కష్టపడ్డారు. రానున్న రోజుల్లో వీటి ఆదాయం ప్రస్తుతం కంటే మూడు రేట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.