శ్రీలంక క్రికెటర్ల ప్రత్యేక విమానానికి తప్పిన పెను ప్రమాదం...!
శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇంధన సమస్య తలెత్తడంతో వారు ప్రయాణిస్తున్న విమానం భారత్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దీంతో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఆందోళన చెందారు.
ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్ మైక్ ఆర్థర్ వెల్లడించారు. విమానం భారత్‌లో ల్యాండ్ అవ్వగానే ఫోన్ ఆన్ చేశానని, ఇంగ్లండ్ ఆపరేషన్స్ మేనేజర్ వేన్ బెంట్లీ నుంచి తనకు కొన్ని సందేశాలు వచ్చాయని, పరిస్థితి గురించి అతను అందులో వివరించాడని మైక్ ఆర్థర్ పేర్కొన్నారు.
"ఇంధన నష్టం జరగడంతో మా విమానాన్ని భారత్‌కు దారి మళ్లించారు. అక్కడ మేం దిగగానే నా ఫోన్ ఆన్ చేశాను. ఇంగ్లాండ్ ఆపరేషన్స్ మేనేజర్ వేన్ బెంట్లీ నుంచి నాకు కొన్ని సందేశాలు వచ్చాయి. పరిస్థితి గురించి అందులో వివరించాడు. దాంతో నిజంగా మేమంతా ఆందోళన చెందాం" అని ఆర్థర్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే, ఈ నెల 13 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. ఇటీవల ఇంగ్లండ్ క్రికెటర్లు కరోనా బారిన పడటంతో, లంక క్రికెటర్లు కూడా ఐసోలేషన్‌లోని వెళ్లాల్సి వస్తుంది. దీంతో భారత్‌తో సిరీస్ షెడ్యూల్ మారే అవకాశం ఉంది.
దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న జరుగనుండగా..జూన్ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.