ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా సలీల్ పరేఖ్
ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఎట్టకేలకు కొత్త సీఈవో పేరును ప్రకటించింది. క్యాప్‌జెమినీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సలీల్ పరేఖ్‌ను సీఈవోగా నియమించింది.
ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఎట్టకేలకు కొత్త సీఈవో పేరును ప్రకటించింది. క్యాప్‌జెమినీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సలీల్ పరేఖ్‌ను సీఈవోగా నియమించింది. క్యాప్‌జెమినీ నుంచి వైదొలుగుతున్నట్లు పరేఖ్ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే ఇన్ఫోసిస్ నియామక ప్రకటన చేయడం గమనార్హం. ఈయన జనవరి 2న ఇన్ఫోసిస్ సీఈవోగా బాధ్యతలు చేపడతారు.
‘ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా సలీల్ పరేఖ్‌ను కంపెనీలోకి ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఐటీ రంగంలో ఆయనకు దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. పరేఖ్ నేతృత్వంలో ఇన్ఫోసిస్ మరింత ముందుకెళ్తుందని బోర్డు విశ్వసిస్తుంది’ అని బీఎస్‌ఈ ఫైలింగ్ సందర్భంగా ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు.
కంపెనీ వ్యవస్థాపకులతో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఈ ఏడాది ఆగస్టులో విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈవో పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న యూబీ ప్రవీణ్ రావుకు తాత్కాలిక సీఈవో బాధ్యతలు అప్పగించారు. జనవరి 2న ప్రవీణ్ రావు సీఈవో పదవి నుంచి వైదొలిగి పూర్తిస్థాయి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బాధ్యతలను కొనసాగిస్తారని కంపెనీ ఈ సందర్భంగా వెల్లడించింది. కాగా, బాంబే ఐఐటీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో పరేఖ్ బీటెక్ పూర్తిచేశారు. కార్నెల్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.