బుల్లెట్ నుంచి మనిషి ప్రాణాలు కాపాడిన స్మార్ట్ ఫోన్
ఇపుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో స్మార్ట్ ఫోన్ అనేది ఓ భాగమైపోయింది. తింటూ, చదువుతూ, పనిచేస్తూ, పడుకుంటూ కూడా ఫోన్‌ను వినియోగించేవారు అనేక మంది ఉన్నారు. ఈ మొబైల్ ఫోన్ వినియోగం అనేది ఇపుడు చాలా మందిలో ఓ వ్యసనంలా మారిపోయింది.
అయితే, అదే ఫోన్ ఒకరి ప్రాణాల్ని నిలిపింది. వేగంగా దూసుకువస్తున్న బుల్లెట్‌ను ఆపి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన బ్రెజిల్‍లోని పెట్రోలీనాలో అక్టోబరు 7వ తేదీన జరిగింది. ఓ దోపిడీ దొంగ ఓ వ్యక్తి నుంచి దోచుకునేందుకు తుపాకీ ఎక్కుపెట్టి కాల్చాడు.
అయితే బుల్లెట్.. ఆ వ్యక్తి షర్ట్ జేబులోని ఐదేళ్ల పాతదైన మోటోరోలా జీ5 ఫోన్‌కు తగిలింది. తూటా శక్తి మొత్తం ఫోన్‌పైనే పడడంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. ఫోన్ స్క్రీన్ బాగా దెబ్బతిన్నదే గానీ, ఫోన్‌ను దాటి బుల్లెట్ ముందుకు మాత్రం పోలేకపోయింది. ఫోన్ డ్యామేజ్ అయినా.. ఆ ఫోన్‌కు ఉన్న హల్క్ ప్రొటెక్షన్ కవర్ మాత్రం చెక్కుచెదరలేదు.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను బాధితుడికి చికిత్సనందించిన వైద్యుడు పెడ్రో కార్వాల్హో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఘటన జరిగిన వెంటనే పెట్రోలీనాలోని యూనివర్సిటీ ఆసుపత్రికి బాధితుడిని తీసుకొచ్చారని, చిన్న గాయం తప్ప పెద్ద గాయాలేవీ కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితుడు క్షేమంగా ఉన్నాడని పెడ్రో చెప్పారు.