సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 5 మే 2019 (18:03 IST)

అమరుల పేర్లు చెప్పుకుని ఓట్లు దండుకునే వ్యక్తి మోడీ : ప్రియాంకా ఫైర్

మాజీ ప్రధానమంత్రి, తన తండ్రి రాజీవ్ గాంధీపై ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగం ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. అమరులైన వారి పేర్లు చెప్పుకుని ఓట్లు రాబట్టుకోవాలని మోడీ చూస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకానీ, అమరులకు మాత్రం గౌరవం ఇవ్వరని విమర్శించారు. 
 
రాజీవ్ గాంధీ ఎవరి కోసమైతే తన జీవితాన్ని త్యాగం చేశారో, ఆ అమేథీ ప్రజలే బుద్ధి చెబుతారని, ఇది నిజమని, మోసాన్ని ఈ దేశం ఎప్పుడూ క్షమించదంటూ ఆ ట్వీట్లో మోడీని విమర్శించారు. కాగా, శనివారం యూపీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాజీవ్ గాంధీపై మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ నెంబర్ వన్ అవినీతి పరుడని మోడీ ఆరోపించిన విషయం తెల్సిందే. 
 
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా స్పందించారు. "మోడీ జీ... పోరు ముగిసింది. మీ ఖర్మ ఫలం ఎదురుచూస్తోంది. మీలోఉన్న నమ్మకం చెదిరిపోతుంది. నా తండ్రిపై చేసే విమర్శలూ మిమ్మల్ని కాపాడలేవు. మీపై ప్రేమతో ఓ కౌగిలింత... రాహుల్" అని ట్వీట్ చేశారు.
 
ఇక మోడీ వ్యాఖ్యలపై చిదంబరం స్పందిస్తూ, అసలు మోడీకి ఏమైనా తెలుసా? అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమేనని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన సంగతి ఆయనకు తెలియకపోయిందని అన్నారు. బోఫోర్స్ కుంభకోణంలో లంచం తీసుకున్నట్టు రాజీవ్‌పై ఎటువంటి సాక్ష్యాధారాలూ లభించలేదని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.