సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (15:38 IST)

సార్వత్రిక ఎన్నికలు : తొలి దశ నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్ 19న పోలింగ్

election commission
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, తొలి దశ పోలింగ్ కోసం భారత ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. మార్చి 27వ తేదీ వరకు నామినేషన్ల సమర్పణకు అవకాశం కల్పించారు. మార్చి 28వ తేదీన పరిశీలన, 30వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. రాష్ట్రపతి తరపున నోటిఫికేషన్ ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయించింది. 
 
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19వ తేదీన జరుగనుంది. దీనికి సీఈసీ నోటిఫికేషన్ జారీచేసింది. నామినేషన్ పత్రాల సమర్పణకు మార్చి 27 చివరి తేదీగా ఉంది. అయితే బీహార్‍‌లో మాత్రం 27వ తేదీన పండుగ ఉండడంతో 28 వరకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. మార్చి 28 నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుందని, బీహార్‌లో మార్చి 30న పరిశీలన ఉంటుందని వివరించింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 30 అని, బీహార్‌లో ఏప్రిల్ 2 వరకు అవకాశం ఉంటుందని వివరించింది. ఈ నోటిఫికేషన్‌తో లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఎన్నికల ప్రక్రియ మొదలైంది.
 
కాగా ఈ నోటిఫికేషన్‌తో దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌‌సభ స్థానాలకు ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ జరగనుంది. అత్యధికంగా తమిళనాడులో 39 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో 12 సీట్లు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 8, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 5 స్థానాలు చొప్పున, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో 2 సీట్లు చొప్పున, ఛత్తీస్‌‌గడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది.