డ్రీమ్ గర్ల్ హేమ మాలిని ఎన్నికల ప్రచారం: గోధుమ కంకులు కోస్తూ...
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు రకరకాల విన్యాసాలు చేస్తుంటారన్నది మనకు తెలిసిందే. తాజాగా సినీ నటి, బీజేపీ నేత పొలాల్లో గోధుమలు కోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధుర ఎంపీ, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి డ్రీమ్‌గర్ల్ హేమమాలిని చేస్తున్న పొలం పనులు చూసి ప్రజలు రకరకాలుగా రియాక్షన్‌లు ఇస్తున్నారు.
మథురలో, హేమమాలిని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు, ఈ సమయంలో కొంతమంది మహిళలు పొలాల్లో గోధుమలు కోస్తుండగా, హేమ కారు ఆపి పొలంలోకి వెళ్లారు. చేతిలో వ్యవసాయ పనిముట్లతో గోధుమ కంకులను కోసి, రైతు మహిళలతో ఫోటోలు దిగారు. తమ మధ్య డ్రీమ్ గర్ల్‌ని గుర్తించిన మహిళలు ఆనందానికి లోనయ్యారు.
మథుర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై హేమమాలిని మూడోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా, వేసవిలో రైతుల మధ్య పనిచేస్తూ హేమ మాలిని ఫోటో సెషన్ చేయించుకున్నారు, దానిపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి. ఎన్నికల్లో గెలవడానికి ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు.
2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మథుర ఎంపీ/సినిమా నటి హేమ మాలిని బల్దేవ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారంలో కొందరు మహిళలతో కలిసి పొలాల్లో గోధుమ కంకులు కోస్తూ మరోసారి కనిపించారు. మహిళా రైతుల మధ్య హేమమాలిని ఇలా పనిచేసినంత మాత్రాన ఎన్నికల్లో గెలుస్తారా అనేది ఎన్నికల ఫలితాల్లో తేలుతుంది.