శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (20:41 IST)

సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా ... క్వారంటైన్‌ నుంచి బాధితులు ఎస్కేప్!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. దేశం యావత్తూ లాక్‌డౌన్‌లో ఉన్నప్పటికీ.. ఈ వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్టపడటం లేదు. దేశంలో ఎక్కడోచోట కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శుక్రవారం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు, ఆర్థిక రాజధాని ముంబై విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తూ వచ్చిన సీఆర్పీఎఫ్ జవాన్లలో 11 మందికి ఈ వైరస్ సోకింది. మరికొందరిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో కొన్ని రోజుల నుంచి 142 మంది సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుళ్లను మహారాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్‌కు తరలించింది. అందరికీ కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి గురువారం పాజిటివ్‌గా నిర్దారణ కాగా శుక్రవారం మరో ఏడుగురికి పాజిటివ్‌గా వచ్చిందని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు.
 
ఇంకోవైపు, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు చేపడుతోంది. ఇందుకోసం భారీ సంఖ్యలో క్వారంటైన్ హోం, ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసిన వైరస్ సోకినవారిని తరలిస్తోంది. అయితే, పలు క్వారంటైన్ కేంద్రాల్లో వుండే రోగులు... ఆ కేంద్రాల నుంచి పారిపోతున్నారు. 
 
తాజాగా పూణేలోని శిరూర్‌ పట్టణంలో క్వారంటైన్‌లో ఉంచిన వారిలో శుక్రవారం ఉదయం 10 మంది పారిపోయారు. పూణే రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో వారందరిపై కేసు నమోదు చేసి.. వారిని పట్టుకునేందుకు సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించామని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.