సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (18:58 IST)

1 నుంచి 8 వరకు ప్రమోట్.. 10, 12 పరీక్షలు ఇప్పుడే కాదు-సీబీఎస్ఈ

చైనా నుంచి పుట్టుకొచ్చి.. ప్రపంచ దేశాలను ఆటాడిస్తున్న కోవిడ్-19 భారత దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించిన సంగతి విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో.. పరీక్షలపై పరిస్థితులను సమీక్షించిన తర్వాతే ఎగ్జామ్స్ నిర్వహణపై ఒక నిర్ణయానికి వస్తామని అంతవరకు వదంతులను నమ్మరాదని సీబీఎస్ఈ బోర్డు స్పష్టం చేసింది. ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్‌సీఈఆర్‌టీని సంప్రదించిన మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని బోర్డు క్లారిటీ ఇచ్చింది.

ఇక సీబీఎస్‌ఈ అనుబంధ స్కూళ్లలో ఇప్పటికే కొన్ని స్కూళ్లు 9వ తరగతి 11వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాయి. మరి కొన్ని స్కూళ్లు నిర్వహించలేదు. అయితే అలాంటి వారు మాత్రం విద్యార్థుల ఇప్పటికే రాసిన టెస్టులు, ప్రాజెక్టులు, టర్మ్ ఎగ్జామ్స్‌ను ఆధారంగా చేసుకుని వారిని ప్రమోట్ చేయాలని సీబీఎస్ఈ సూచనలు చేసింది. ఒకవేళ విద్యార్థులు ఈ అంతర్గత ప్రక్రియలో క్లియర్ కాలేదంటే వారికి ఆన్‌లైన్ ద్వారా లేదా ఆఫ్ లైన్ ద్వారా ఈసమయంలోనే స్కూలు టెస్టును నిర్వహించాలని సూచించింది.

ఇక 10వ తరగతి 12వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ అధికారులతో చర్చించాక ఒక నిర్ణయం తీసుకుంటామని సీబీఎస్ఈ బోర్డు స్పష్టం చేసింది. అదే సమయంలో విద్యార్థులు రాసే ఎంట్రెన్స్ పరీక్షలు, అడ్మిషన్స్ తేదీలను కూడా పరిగణలోకి తీసుకుని కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని సీబీఎస్ఈ వెల్లడించింది. అయితే బోర్డు పరీక్షలకు పది రోజుల ముందే అందరికీ నోటీసు ద్వారా తెలియజేయడం జరుగుతుందని సీబీఎస్ఈ పేర్కొంది.