ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (17:45 IST)

కోటాలో కలవరపెడుతున్న ఆత్మహత్యలు.. 8 నెలల్లో 19 మంది ఆత్మహత్య

suicide
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. గత ఎనిమిది నెలల్లో మొత్తం 19 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు రెండు, మూడు వారాలకు ఒరకు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నారు. ఈ క్రమంలో మెడికల్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతోన్న మరో విద్యార్థి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనో జ్యోత్‌గా గుర్తించారు. 
 
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 19 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ రామ్‌పూర్‌కు చెందిన మనోజ్యోత్ ఛబ్రా.. మెడికల్ ఎంట్రాన్స్ ఎగ్జామ్ శిక్షణ కోసం ఈ ఏడాది జనవరిలో కోటాకు వచ్చాడు. నీట్ కోచింగ్ తీసుకుంటున్న అతడు.. గురువారం ఉదయం తన హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
 
వివిధ పోటీ పరీక్షల కోసం ఇక్కడి కోచింగ్ సెంటర్లు ఎంతో ప్రసిద్ధి. పొరుగు రాష్ట్రాల నుంచి ఏటా వేల మంది విద్యార్థులు శిక్షణ పొందుతారు. ఈ ఏడాది దాదాపు 2.5 లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే అక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 
 
గతేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 19కు చేరడం గమనార్హం. అంతకుముందు కూడా పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. వీటితోపాటు అనేక ఘటనల్లో విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఒత్తిడితోనే ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.