ఆక్సిజన్ లేక గంటకొక్కరు చనిపోయారు... హస్తినలో దయనీయస్థితి!
దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన పరిస్థితులు నెలకొనివున్నాయి. కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి కల్లోలం సృష్టిస్తోంది. దీంతో లక్షలాది మంది కరోనా వైరస్ బారినపడుతున్నారు. వారిని చేర్చుకుని చికిత్స చేసేందుకు సరిపడిన పడకలు లేవు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. దీంతో ఢిల్లీ ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో కరోనా బారినపడిన రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా గత 24 గంటల్లో 25 మంది రోగులు చనిపోయినట్లు ఈ ఉదయం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మరో 60 మంది రోగుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, సకాలంలో ఆక్సిజన్ అందకపోతే వారిని ప్రాణాలతో కాపాడటం కష్టమని పేర్కొన్నారు.
రెండు గంటలకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. మ్యానువల్ వెంటిలేషన్ ద్వారా ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డుల్లో రోగులకు చికిత్స చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు చనిపోయినట్లు ఈ ఉదయం 8 గంటలకు ప్రకటించగా, ఆ తర్వాత రెండు గంటలకు ఆక్సిజన్ ట్యాంకర్లు ఆస్పత్రికి చేరుకున్నాయి.
రోగులు చనిపోవడానికి ఆక్సిజన్ కొరత ఒక్కటే కారణం కాదు. కరోనా లక్షణాలు తీవ్రమైన తర్వాత చివరి దశలో ఆస్పత్రికి వస్తున్నారని, తద్వారా మరణిస్తున్నారని ఆస్పత్రి ఛైర్మన్ డీఎస్ రాణా తెలిపారు.