బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 22 ఏప్రియల్ 2021 (12:17 IST)

కోవిడ్: ఆక్సిజన్ కొరతతో ఒక్కరు కూడా చనిపోకుండా చూడండి, కేంద్రానికి దిల్లీ హైకోర్టు ఆదేశాలు

"ఆక్సిజన్ కొరత వల్ల దేశంలో కరోనా రోగులు ఎవరూ చనిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం" అని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. స్టీల్, పెట్రోలియం పరిశ్రమలకు ఆక్సిజన్‌ సరఫరా ఆపేసి, దానిని కోవిడ్-19 రోగులకు ఎందుకు సరఫరా చేయకూడదు అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. సీరియస్‌గా ఉన్న కోవిడ్-19 రోగులకు అందించడానికి తమ దగ్గర సరిపడినంత ఆక్సిజన్ లేదని, వెంటనే ఆక్సిజన్ ఏర్పాటు చేయాలంటూ మాక్స్ ఆస్పత్రి కోర్టులో పిటిషన్ వేసింది.

 
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పెట్రోల్, స్టీల్ పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా ఆపివేసి దానిని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. "టాటా తమ ఆక్సిజన్‌ను డైవర్ట్ చేయగలిగినప్పుడు, మిగతా వారు ఎందుకు చేయకూడదు. అలా చేయకపోవడం దురాశే అవుతుంది. అవసరమైతే స్టీల్, పెట్రోలియం పరిశ్రమలు ఆక్సిజన్‌ వాడకంపై నిషేధం విధించండి" అని కోర్టు చెప్పింది.

 
"చుట్టూ జరుగుతున్న నిజాలను ఈ ప్రభుత్వం ఎలా విస్మరిస్తుంది. మెడికల్ ఆక్సిజన్ ఎంత ముఖ్యమైన అవసరమో ప్రభుత్వానికి స్పృహ లేకపోవడం మమ్మల్ని దిగ్భ్రాంతికి, నిరాశకు గురిచేసింది" అని కోర్టు వ్యాఖ్యానించింది. దిల్లీకి అందే ఆక్సిజన్ స్థాయిని 350 మెట్రిక్ టన్నుల నుంచి 480 మెట్రిక్ టన్నులకు పెంచుతామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హామీ ఇచ్చారు. రోజంతా మాక్స్ ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్‌ను సరఫరా చేశామని ఆ తర్వాత కోర్టుకు సమాచారం ఇచ్చారు.

 
జస్టిస్ విపిన్ సంఘీ, రేఖా పాలీ ధర్మాసనం ఈ కేసును విచారించింది. బుధవారం రాత్రి 8 గంటలకు బెంచ్ ఈ పిటిషన్‌పై ప్రత్యేక విచారణ జరిపింది.