1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (09:26 IST)

సీఎం కేసీఆర్‌లో కరోనా లక్షణాలు లేవు : డాక్టర్ ఎంవీ రావు

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ఆయనలో కరోనా లక్షణాలు తగ్గిపోయానని, త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుంటారని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ సోమాజిగూడ యశోద దవాఖానలో సీఎం కేసీఆర్‌కు సీటీ స్కాన్‌తోపాటు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. 
సీఎం కేసీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలు చేశారు. సీఎం కేసీఆర్‌ ఊపిరితిత్తులు సాధారణంగా ఉన్నాయని, ఎటువంటి ఇన్ఫెక్షన్‌ లేదని, సీటీ స్కాన్‌లో ఎలాంటి లక్షణాలు బయటపడలేదని డాక్టర్లు వివరించారు. 
 
సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలు సేకరించారు. దీనికి సంబంధించిన రిపోర్ట్‌లు గురువారం రానున్నాయి. సీఎం వెంట మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌ ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు.
 
అంతేకాకుండా, సీఎం కేసీఆర్‌కు కరోనా లక్షణాలు తగ్గిపోయాయని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని కేసీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. ముఖ్యమంత్రి పూర్తిగా కోలుకొని త్వరలోనే విధులకు హాజరయ్యే అవకాశం ఉన్నదని వివరించారు. 
 
సీటీ స్కాన్‌ చేశామని, నార్మల్‌గా ఉన్నదని పేర్కొన్నారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ బాగున్నాయని చెప్పారు. సీటీ స్కాన్‌తోపాటు సాధారణ పరీక్షలు కూడా నిర్వహించినట్టు తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి కరోనా లక్షణాలు ఏమీ లేవని, వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు తేలిన మరుక్షణం నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్‌ హోంఐసొలేషన్‌లో ఉన్నారని, ఇది మంచి ఫలితం ఇచ్చిందన్నారు.