1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (10:52 IST)

ముంబైలో కుప్పకూలిన ఆరోగ్య వ్యవస్థ.. చేతులెత్తేసిన వైద్యులు (Video)

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై కరోనా పంజా విసిరింది. ఈ నగరంలో కరోనా రెండో దశ వ్యాప్తి ముమ్మరంగా సాగుతోంది. ఇది రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాల్చుతోంది. మంగళవారం దేశవ్యాప్తంగా కొత్తగా 2.94 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
2020లో చోటుచేసుకున్న మరణాల కన్నా ఇప్పుడు మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. దేశరాజధాని ముంబైలో వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. వైద్య సదుపాయాలు అందక కరోనా బాధితులు కళ్ళెదుటే ప్రాణాలు విడుస్తున్నారు. వైద్యులు కూడా ఏం చేయలేక చేతులెత్తేశారు. తాము ఎలాంటి సహాయం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు ప్రకటించారు.  
 
ప్రస్తుతం ముంబైలో నెలకొన్న పరిస్థితుల్లో ఒక వైద్యురాలికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో డాక్టర్ తృప్తి గిలాడా రోదిస్తున్నారు. "చాలామంది వైద్యుల మాదిరిగానే నేను కూడా ఎంతో ఆందోళన పడుతున్నాను. ముంబైలో పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. ఇక్కడి ఆసుపత్రులలోని ఐసీయూలలో ఖాళీలు లేవు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని చూడలేదు. మేము నిస్సహాయులం. ప్రస్తుత పరిస్థితిలో ఎమోషనల్ బ్రేక్‌డౌన్ అనేది డాక్టర్లందరిలోనూ ఎంతోకొంత ఉండనే ఉంది. అందుకే మన ఆరోగ్యాన్ని మనమే పరిరక్షించుకోవాలి" అని ఆమె ప్రజలను కోరారు. 
 
అదేసమయంలో కరోనా వైరస్ బారినపడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలకు లోబడి నడుచుకోవాలని, ముఖానికి తప్పకుండా మాస్క్ ధరించాలని కోరారు. అలాగే, కరోనా వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని కోరారు. లేనిపక్షంలో మరింతగా ప్రమాదంలో పడే ఆస్కారం ఉందని ఆమె హెచ్చరించారు. ముంబైలో అయితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా దిగజారిపోయిందని చెప్పారు. ఆమె పోస్ట్ చేసిన ఓ సెల్ఫీ వీడియో ముంబైలోని వాస్తవ పరిస్థితికి అద్ధంపడుతోంది.