శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (09:12 IST)

గుజరాత్ కొత్త ఎమ్మెల్యేల్లో 40 మంది నేర చరితులే..

criminals
ఇటీవల గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ మరోమారు అధికారాన్ని దక్కించుకుంది. తద్వారా వరుసగా ఏడోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా చరిత్ర సృష్టించింది. మొత్తం 182 అసెంబ్లీ సీట్లున్న గుజరాత్ శాసనసభలో ఒక్క బీజేపీ మాత్రమే ఏకంగా 156 సీట్లను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 17, ఆమ్ ఆద్మీ పార్టీ 5 చోట్ల విజయం సాధించారు.
 
అయితే, కొత్త అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యుల్లో ఏకంగా 40 మంది నేరచరితులే కావడం గమనార్హం. వీరిలో 20 మంది తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. బీజేపీ తరపున ఎన్నికైన 156 మంది ఎమ్మెల్యేల్లో 26 మంది, 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 9 మంది, ఐదుగురు ఆప్ శాసనసభ్యుల్లో ఇద్దరిపై ఈ తరహా తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్టు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) వెల్లడించింది. 
 
ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థులు సమర్పించిన వివరాల ఆధారంగా ఏడీఆర్ ఈ వివరాలను వెల్లడించింది. నేరచరిత్ర కలిగిన 40 మందిలో 29 మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉండగా, కొందరిపై అత్యాచారం, హత్య కేసు కూడా ఉండటం గమనార్హం. అయితే, గత 2017లో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే ఇపుడు కొంతమేరకు తగ్గింది. గతంలో 47 మంది నేరచరితులు అసెంబ్లీకి ఎన్నికకాగా, ఇపుడు ఈ సంఖ్య 40కి తగ్గినట్టు ఏడీఆర్ వెల్లడించింది.