బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (16:25 IST)

పెను విషాదం మిగిల్చిన భారీ వర్షం : ఐదుగురి మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఘ‌జియాబాద్ ప‌ట్ట‌ణంలో భారీ వర్షం పెను విషాదం మిగిల్చింది. ఇక్కడ కురిసిన భారీ వర్షానికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భారీ వ‌ర్షం కార‌ణంగా విద్యుత్ షాక్ త‌గిలి ఐదుగురు వ్య‌క్తులు మృతి చెందారు. 
 
మృతుల్లో ఒక మ‌హిళ, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఘ‌జియాబాద్‌లోని సిహానీగేట్ పోలీస్ స్టేష‌న్ ఏరియా రాకేష్ మార్గ్‌లోని తేన్ సింగ్ ప్యాలెస్ స‌మీపంలో బుధ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానికంగా ఓ కిరాణాషాపు య‌జ‌మాని ఎండ త‌గుల‌కుండా త‌న షాపు ముందు రేకుల క‌ప్పు ఏర్పాటుచేసుకున్నాడు. అయితే ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షం కార‌ణంగా క‌రెంటు తీగ కొంచెం జారి రేకుల‌కు అనుకుంది. 
 
ఆ రేకులకు ఆనుకుని ఒక ఇనుప టెలిఫోన్ స్తంభం ఉంది. బుధ‌వారం ఉద‌యం ఇద్ద‌రు చిన్నారులు ఆ దుకాణంలో తినుబండారాలు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా చిన్నారులిద్ద‌రూ ఇనుప స్తంభాన్ని ట‌చ్ చేయ‌డంతో షాక్ త‌గిలి అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు.
 
ప‌క్క‌నే ఉన్న మ‌రో ముగ్గురు వారిని కాపాడేందుకు ప్ర‌య‌త్నించ‌గా వారు కూడా విద్యుత్ షాక్‌తో స్పృహ కోల్పోయారు. వెంట‌నే ఆ ముగ్గురిని ఆస్ప‌త్రికి త‌రలించ‌గా చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. మృతులు జాన‌కి (35), ఆమె కూతురు సుభి (3), ల‌క్ష్మీశంక‌ర్ (24), ఖుషి (10), సిమ్రాన్ (11)గా గుర్తించారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.