శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (04:32 IST)

కర్ణాటకలో 'లాక్​డౌన్​'ను ఉల్లంఘిస్తే 6 నెలలు జైలు

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండగా అత్యధిక రాష్ట్రాలు లాక్​డౌన్​లోకి వెళ్లాయి. అయితే కొందరు ప్రభుత్వాల ఆదేశాలు పాటించడం లేదు. దీంతో ఉల్లంఘించిన వారికి 6నెలలు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని కర్ణాటక సర్కారు హెచ్చరించగా.. అతిక్రమించిన వారంతా మూర్ఖులని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో మెజారిటీ రాష్ట్రాలు లాక్​డౌన్​ను ప్రకటించాయి. అయితే కొందరు ఈ నిర్బంధాన్ని లెక్కచేయకపోవడాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. కర్ణాటకలో మార్చి 31 వరకు ప్రజలంతా లాక్​డౌన్​ను అనుసరించాలని ప్రభుత్వం కోరింది.

ఎవరైనా నిర్బంధాన్ని అతిక్రమిస్తే ఆరునెలల జైలుశిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. నిర్బంధ కాలం ముగిసే వరకు ఎక్కడివారు అక్కడే ఉండాలని హోం మంత్రి బసవరాజ్​ ఆదేశించారు.
 
తెలంగాణలో రోడ్డెక్కితే బండి సీజ్
కరోనా నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. అయితే ప్రజలు మాత్రం లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్నారు. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజలెవరూ పట్టించుకోవడం లేదు.  దాంతో లాక్‌డౌన్ ఉల్లంఘించే వారికి కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది.

రాష్ట్రాలు ఖచ్చితంగా లాక్‌డౌన్‌ను అమలుచేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. మధ్యాహ్నం నుంచి లాక్‌డౌన్ సీరియస్ అమలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కూడా తెలిపింది. రోడ్లపైకి వస్తున్న జనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. ఆటోలను, క్యాబ్‌లను ఆపి మళ్లీ రావొద్దంటూ సూచిస్తున్నారు.

వాహనాల నుంచి ప్రయాణికలను దించి. డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల వాహనదారులకు భారీ ఫైన్‌లు విధిస్తున్నారు. మరికొన్నిచోట్ల వాహనాలను సీజ్ కూడా చేస్తున్నారు. స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటించాలని పోలీసులు కోరుతున్నారు. సీజ్ చేసిన వాహనాలను లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు ఇవ్వమని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

రోడ్డు మీదకు ఎవరోచ్చినా  ప్రశిస్తామని ఆయన తెలిపారు. అత్యవసర పని ఉంటేనే బయటకు రావాలని ఆయన కోరారు. సాయంత్రం 7 నుంచి ఉదయం 6 వరకు షాపులు, పెట్రోల్ బంకులు అన్నీ మూతపడతాయని ఆయన తెలిపారు. ప్రజలందరూ తమ ఇంటి దగ్గర్లోని కిరాణా షాపు వరకే వెళ్లాలని.. రోడ్ల మీదకు అనవసరంగా రాకూడదని ఆయన అన్నారు. బైక్‌పై ఒకరికి, కారులో ఇద్దరికి మాత్రమే బయటకు వెళ్లే అనుమతినిస్తున్నట్లు ఆయన తెలిపారు.