ఫిజియోథెరపీ చేస్తా.. ఫిట్‌గా ఉంచుతా.. అమ్మాయిలకు ట్రైనర్ వేధింపులు
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకు చెందిన ఓ క్రీడా శిక్షకుడు (ట్రైనర్) పి.నాగరాజన్ (59)పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి. ఫిజియోథెరపీ పేరుతో ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పలువురు బాధిత యువతులు ఆరోపిణలు చేస్తున్నారు.
ఇటీవల ఓ మహిళా అథ్లెట్ తనపై కోచ్ నాగరాజన్ గత కొన్నేళ్లుగా లైంగిక దాడులకు పాల్పడుతున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా, మరో ఏడుగురు మహిళా అథ్లెట్లు తమపైనా నాగరాజన్ దారుణాలకు పాల్పడ్డాడంటూ ముందుకు వచ్చారు.
దీంతో చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరింతగా లోతుగా విచారణ జరిపారు. ఈ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా క్రీడాకారులు గాయపడటం సహజం. ఇదే ఆ కోచ్‌కు మంచి అవకాశంగా మారింది. తన వద్ద శిక్షణ తీసుకునే అమ్మాయిలు గాయపడినపుడు వారికి ఫిజియో థెరపీ పేరిట లైంగిక వాంఛ తీర్చుకోసాగాడు.
'ఫిజియోథెరపీ చేస్తాను, ఇది మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతుంది' అంటూ వారికి నచ్చజెప్పి లైంగికదాడికి పాల్పడుతూ వచ్చినట్టు తేలింది. ఒకవేళ తనకు సహకారం అందించకపోతే పెద్ద ఈవెంట్లలో పాల్గొనలేరని బెదిరింపులకు దిగుతూ తన లైంగక వాంఛ తీర్చుకుంటూ వచ్చినట్టు వెల్లడైంది.