గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (10:17 IST)

ఇల్లు కూల్చివేస్తుండగా బయటపడిన బంగారు నిధి... పంచేసుకున్న కూలీలు

gold coins
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బంగారు గని ఒకటి బయటపడింది. ఓ ఇంటిని కూల్చివేస్తుండగా ఇది వెలుగులోకి వచ్చింది. ఈ బంగారు నాణేలను చూడగానే కూలీలకు దురాశ పుట్టింది. ఆ వెంటనే వారంతా మాట్లాడుకుని ఆ బంగారు నాణేలను పంచుకున్నారు. ఈ కూలీల్లో ఓ తాగుబోతు మాటల సందర్భంలో ఈ బంగారు గని గురించి చెప్పాడు. అంతే, ఈ బంగారు గని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పురావస్తు శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ బంగారు గని సొత్తు విలువ రూ.1.25 కోట్ల మేరకు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌లో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శిథిలావస్థలో ఉన్న ఓ ఇంటిని ఇటీవల ఎనిమిది మంది కూలీలు కూల్చివేస్తున్నారు. వారు పనులు మొదలుపెట్టి కొంత భాగాన్ని కూల్చివేశారు. ఆ శిథిలాలను తొలగిస్తున్న సమయంలో ఓ లోహపు పాత్ర కనిపించింది. దానిని తీసుకుని చూడగా అందులో 84 పురాతన బంగారు నాణేలు, ఆభరణాలు కనిపించాయి. ఈ విషయాన్ని ఇంటి యజమానికి చెప్పకుండా ఎనిమిది మంది కూలీలు పంచుకున్నారు. 
 
ఈ క్రమంలో ఓ కూలీ తనకు వచ్చిన వాటాలోని ఓ బంగారు నాణెంను విక్రయించి కొన్ని సరకులతో పాటు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. మిగిలిన సొమ్ముతో మద్యం సేవించాడు. ఆ మత్తులో ఈ బంగారు నాణేల గని వ్యవహారాన్ని బయటపెట్టేశాడు.
 
ఇది ఆ నోటా, ఈ నోటా చేరి చివరకు పోలీసులకు, పురావస్తు శాఖ అధికారులకు చేరింది. దీంతో వారు రంగంలోకి దిగి కూలీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కూలీలకు దొరికిన లోహపు పాత్రలోని ఆభరణాలు, నాణేల విలువ రూ.60 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అయితే, పురావస్తు శాఖ మాత్రం ఆ సొత్తు విలువ రూ.1.25 కోట్ల వరకు ఉంటుందని చెబుతోంది.