సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2017 (06:44 IST)

ఆరుషి హత్య కేసులో తల్లిదండ్రులు నిర్దోషులు.. అలహాబాద్ కోర్టు

తొమ్మిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్‌ హత్య కేసులో అలహాబాద్‌ హైకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులు రాజేశ్‌, నుపూర్‌లు చంపలేదని కోర్టు తెలి

తొమ్మిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్‌ హత్య కేసులో అలహాబాద్‌ హైకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులు రాజేశ్‌, నుపూర్‌లు చంపలేదని కోర్టు తెలిపింది. ఈ కేసులో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.
 
2008, మే 15న 14 యేళ్ళ ఆరుషి నొయిడాలోని ఆమె ఇంట్లోనే హత్యకు గురైంది. ఈ హత్య కేసు సంచలనం సృష్టించింది. ఆమెను గొంతుకోసి చంపేశారు. దంతవైద్యులుగా పనిచేస్తున్న ఆరుషి తల్లిదండ్రులు నుపూర్‌, రాజేశ్‌ తల్వార్‌లు పనిమనిషి హేమ్‌రాజ్‌ సాయంతో బాలికను హత్య చేసినట్లు అప్పట్లో కేసు నమోదైంది. ఘటన జరిగిన తర్వాత నుంచి హేమ్‌రాజ్‌ కన్పించకుండాపోయాడు. దీంతో అతడే ప్రధాన నిందితుడి అయి ఉంటాడని పోలీసులు అనుమానించారు. అయితే హేమ్‌రాజ్‌ కూడా హత్యకు గురవడంతో కేసు మరో మలుపు తిరిగింది. 
 
ఆరుషి హత్య జరిగిన మరుసటి రోజు ఆమె ఇంటి టెర్రస్‌పై హేమ్‌రాజ్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసును పరువు హత్యగా పేర్కొన్న పోలీసులు ఆరుషి తండ్రిని అరెస్టు చేశారు. బెడ్‌రూంలో ఆరుషి హేమ్‌రాజ్‌తో సన్నిహితంగా కన్పించిందని దీంతో ఆవేశానికి గురైన రాజేశ్‌ వారిద్దరినీ హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే కేసులో స్పష్టత లేకపోవడంతో 2008 మేలో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. 
 
యేడాది పాటు విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు రాజేశ్‌ సహాయకుడు కృష్ణ, పనిమనుషులు రాజ్‌కుమార్‌, విజయ్‌లను నిందితులుగా పేర్కొన్నారు. అయితే వీరిపై ఆరోపణలను అధికారులు నిరూపించలేకపోయారు. దీంతో 2009లో ఈ కేసును సీబీఐలోని మరో బృందానికి అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన కొత్త బృందం రాజేశ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. రాజేశ్‌ మాత్రం తాను అమాయకుడినని చెప్పుకొచ్చాడు. అయితే తమ ఇంట్లో రెండు హత్యలు ఎలా జరిగాయో మాత్రం వెల్లడించలేకపోయాడు. 
 
దీంతో ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులే దోషులని నిర్ధారిస్తూ 2013లో సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. వారికి జీవితఖైదు విధించింది. అయితే సీబీఐ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాజేశ్‌ దంపతులు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును గురువారం వెల్లడించింది. ఆరుషిని రాజేశ్‌ దంపతులు హత్య చేయలేదని.. అనుమానంతోనే వారికి శిక్ష విధించారని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.