మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2017 (16:16 IST)

హత్య కేసుల్లో నేరం రుజువైతే.. డేరా బాబాకు ఉరిశిక్ష ఖాయమట..

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో 20 ఏళ్ల శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్‌కు ఉరిశిక్ష కూడా పడనుందా? అవుననే అంటున్నారు న్యాయ నిపుణులు. గతంలో ఆయనపై నమోదైన హత్య కేసుల

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో 20 ఏళ్ల శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్‌కు ఉరిశిక్ష కూడా పడనుందా? అవుననే అంటున్నారు న్యాయ నిపుణులు. గతంలో ఆయనపై నమోదైన హత్య కేసుల్లో విచారణ జరగనుండగా, వీటిని ఆయనే చేయించాడని తేలితే మరణశిక్ష ఖాయమన్నది వారి అభిప్రాయంగా ఉంది. 
 
డేరాలో అకృత్యాలు జరుగుతున్నాయని మొట్టమొదటిసారిగా బాహ్య ప్రపంచానికి తెలియజెప్పిన, పూర సచ్ఛ్ జర్నలిస్ట్ రాంచందర్ ఛత్రపతి ఆత్మహత్య, అప్పట్లో డేరా మేనేజర్‌గా పని చేస్తూ అనుమానాస్పద స్థితిలో మరణించిన రంజిత్ సింగ్ కేసుల విచారణ పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. 
 
ఛత్రపతిని చంపించి ఆత్మహత్యగా చిత్రీకరించారని, తన రహస్యాలను ఎక్కడ బయట పెడతాడోనన్న అనుమానంతో రంజిత్ నూ గుర్మీతే హత్య చేయించాడన్న అనుమానాలు ఎంతోకాలంగా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ రెండు కేసుల్లో గుర్మీత్‌పై ఇప్పటికే అభియోగాలు నమోదు కాగా, సాక్షుల విచారణ కూడా ముగిసింది. తుది వాదనలు ఆలకించి తీర్పు ఇవ్వడమే మిగిలివుంది. ఈ కేసులో డేరా బాబా దోషిగా తేలితే మాత్రం ఉరిశిక్ష పడటం ఖాయమని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇదిలావుండగా, ఈ రెండు హత్య కేసుల్లో డేరా బాబా ప్రమేయంపై ఆయన మాజీ డ్రైవర్, అప్పటి ప్రత్యక్ష సాక్షి అయిన ఖట్టా సింగ్ తన తాజా ప్రకటనను రికార్డు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. 2007లో డేరా బాబాకు వ్యతిరేకంగా సాక్ష్యమిమిచ్చిన ఖట్టా సింగ్ 2012లో అందుకు భిన్నంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారడంతో ఆయన ధైర్యంగా ముందుకొచ్చారు. 
 
అప్పడు తనను భయపెట్టిన కారణంగానే స్టేట్‌మెంట్ మార్చి చెప్పాల్సి వచ్చిందని, ఇప్పుడు తన స్టేట్‌మెంట్‌ను మరోసారి రికార్డు చేయాలని ఆయన కోర్టును కోరారు. దీనిపై ఖట్టా సింగ్ న్యాయవాది శనివారం మీడియాతో మాట్లాడుతూ, 'ఖట్టా సింగ్ 2007లో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కేవలం భయం కారణంగానే 2012లో మార్చి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. కోర్టు ముందు తనకు తానుగా హాజరై అసలు విషయం చెప్పాలనుకుంటున్నారు' అని తెలిపారు.