శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (09:37 IST)

క్రికెట్ బెట్టింగులో రూ.1.5 కోట్లు నష్టపోయిన భర్త.. వివాహిత ఆత్మహత్య

suicide
కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో విషాదం చోటుచేసుకుంది. ఐపీఎల్ బెట్టింగుల్లో రూ.1.5 కోట్ల మేరకు భర్త నష్టపోయారు. ఈ విషయం తెలిసిన ఆయన భార్య 23 యేళ్ళ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ బెట్టింగులకు పాల్పడింది కూడా సాదాసీదా వ్యక్తి కాదు. ప్రభుత్వ ఇరిగేషన్ శాఖలో పనిచేసే అసిస్టెంట్ ఇంజనీర్. అప్పులు చేసి ఈ బెట్టింగుల్లో పాల్గొని నష్టపోయాడు. చేసిన అప్పుల్లో ఏకంగా రూ.కోటి పేరుకునిపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ వేధింపులు తాళలేక అతని భార్య బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.
 
దర్శన్, రంజిత దంపతులకు గత 2020లో వివాహం జరిగింది. రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖలో దర్శన్ అసిస్టెంట్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల బెట్టింగులకు అలవాటుపడిన దర్శన్ భారీగా నష్టపోయాడు. నష్టం వచ్చిన ప్రతిసారీ అప్పుచేసి మరీ బెట్టింగులకు దిగడంతో రూ.కోటి మేర అప్పులు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో అప్పుల వాళ్ల వేధింపులు భరించలేకపోయిన రంజిత ఇటీవల చిత్రదుర్గలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
పెళ్లైన ఏడాదికి తన భర్త బెట్టింగుల వ్యసనం రంజితకు తెలిసిందని ఆమె తండ్రి వెంకటేశ్ మీడియాకు తెలిపారు. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. తన ఫిర్యాదులో రుణాలిచ్చిన 13 మంది పేర్లు ప్రస్తావించారు. బెట్టింగుల్లో సులువుగా డబ్బులు సంపాదించొచ్చంటూ నిందితులు తన అల్లుడిని ఉచ్చులోకి దింపారని ఆరోపించారు.
 
'అతడికి బెట్టింగులు ఇష్టం లేదు. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇదే సరైనా మార్గం అంటూ నిందితులే అతడిని బలవంతంగా ఉచ్చులోకి దింపారు. బ్లాంక్ చెక్కు షూరిటీగా తీసుకుని బెట్టింగులకు కావాల్సిన డబ్బులు ఇచ్చారు' అని ఆయన ఆరోపించారు. మీడియా కథనాల ప్రకారం, దర్శన్ మొత్తం రూ.1.5 కోట్లకు పైగా అప్పులు చేశాడు. వాటిలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించగా ప్రస్తుతం మరో రూ. 84 లక్షలు బాకీ ఉన్నాడని తెలుస్తోంది. ఈ డబ్బులు ఇచ్చిన వారు వేధించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.