పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు రద్దు
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం డ్రోన్లను ప్రయోగిస్తూనే ఉంది. దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసింది. ఈ మేరకు ఇరు సంస్థలు ఓ ప్రకటన చేశాయి.
'తాజా పరిణామాలు, ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృతసర్, భుజ్, జామ్ నగర్, చండీఘడ్, రాజ్‌కోట్ నగరాలకు మంగళవారం నుంచి విమాన రాకపోకలు నిలిపివేస్తున్నాం. పరిస్థితులు నిశితంగా గమనిస్తున్నాం. అప్‌డేట్‌లను ఎప్పటికపుడు ప్రకటిస్తాం' అని ఎయిరిండియా తమ ప్రకటనలో వెల్లడించింది.
అటు ఇండిగో కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. 'ప్రయాణికులు భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం. దీనివల్ల మీ ప్రయాణ ప్రయాణికలకు అంతరాయం ఏర్పడినప్పటికీ రద్దు చేయక తప్పట్లేదు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నా' అని కంపెనీ పేర్కొంది. శ్రీనగర్, లేహ్, రాజ్‌కోట్, చండీఘడ్, జమ్మూ, అమృతసర్ ప్రాంతాలకు ఇండిగో విమాన సర్వీసులను నిలిపివేసింది.
వాస్తవానికి సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్టు అనిపించడంతో సోమవారం నుంచి 32 విమానాశ్రయాలను తిరిగి అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో విమాన సేవలను పునరుద్ధరించేందుకు ఎయిర్ లైన్లు కూడా సిద్ధమయ్యాయి. అయితే, జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో సోమవారం రాత్రి డ్రోన్ల కదలికలు కనిపించాయి.