శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (12:11 IST)

సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి కింద శివలింగం : అఖిలేష్ యాదవ్

akhilesh yadav
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంగా మారాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి కింద శివలింగం ఉందని నమ్ముతున్నట్టు చెప్పారు. అందువల్ల అక్కడ కూడా తవ్వకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 
 
రాష్ట్రంలోని సంభాల్‌లో మొఘలుల కాలం నాటి మసీదులో జరుగుతున్న తవ్వకాలపై ఆయన సోమవారం లక్నోలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజా సమస్యలపై దృష్టి మళ్లించేందుకే కూల్చివేతలు చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి నివాసం కింద కూడా శివలింగ్ ఉందని నమ్ముతున్నాం. అక్కడ కూడా తవ్వకాలు చేపట్టాలి. అమాయకుల ఇళ్లను బుల్డోజర్లతో అక్రమంగా కూల్చివేస్తున్నారు. ఇది అభివృద్ధి కాదు. విధ్వంసం. ముఖ్యమంత్రి చేతుల్లో అభివృద్ధి రేఖ లేదు.. విధ్వంస రేఖ మాత్రమే ఉంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. సంభాల్‌లో తవ్వకాలు చేపడితే మీకేంటి అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి సూటిగా ప్రశ్నించారు. 2013లో అఖిలేష్ యాదవ్ వెయ్యి టన్నుల బంగారాన్ని వెలికి తీసేందుకు రాష్ట్రంలోని మొత్తం యంత్రాంగాన్ని ఉపయోగించాడు. బంగారం తియ్యడానికి ఆయన రెఢీ అయ్యారు. కానీ, శివలింగం విషయంలో ఆయనకు ఏదో సమస్య ఉంది. అందుకే ఆయన సీఎం ఇంటి కింద తవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.