శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2024 (10:05 IST)

టైమ్స్ ప్రపంచ ప్రభావశీల టాప్-100 జాబితాలో బాలీవుడ్ నటి!!

alia bhatt
ప్రతిష్టాత్మక టైమ్స్ పత్రిక 2024 సంవత్సరానికిగాను ప్రపంచ ప్రభావశీలి టాప్ -100 మంది వ్యక్తుల జాబితాను ప్రకటించింది. ఇందులో పలువురు భారతీయులు నిలిచారు. బుధవారం విడుదలైన ఈ జాబితాలో బాలీవుడ్ నటి అలియా భట్ పేరు కూడా ఉంది. అలాగే, భారతీయుడైన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఒలింపియన్ రెజ్లర్ సాక్షి మాలిక్, నటుడు, దర్శకుడు దేవ్ పటేల్‌కు చోటు దక్కింది. అదేవిధంగా, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ లోన్ ఆఫీస్ డైరెక్టర్ జిగర్ షా, యేల్ యూనివర్సిటీలో అస్ట్రానమీ, ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రియంవదా నటరాజన్, భారత సంతతికి చెందిన రెస్టారెంట్ యజమాని అస్మా ఖాన్, రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ భార్య యులియా ఈ జాబితాలో నిలిచారు.
 
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ప్రొఫైన్‌ను యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ వివరించారు. సవాళ్లతో కూడుకున్న అత్యంత ముఖ్యమైన సంస్థను మార్చే నైపుణ్యం, ఉత్సాహం కలిగిన వ్యక్తిని గుర్తించడం అంత సులభమైన పనికాదని, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అజయ్ బంగా ఆ పనిని చేసి చూపిస్తున్నారని యెల్లెన్ అన్నారు. బ్యాంక్ అకౌంట్లు లేని లక్షలాది మందిని డిజిటల్ ఎకానమీలోకి తీసుకువచ్చారని కొనియాడారు. పేదరికం లేని ప్రపంచాన్ని సృష్టించాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు.