తాజ్ మహల్ రచ్చ... విస్మరిస్తే గుర్తింపును కోల్పోయినట్టే : ప్రధాని మోడీ
ఉత్తరప్రదేశ్ సర్కారు తమ రాష్ట్ర పర్యాటక గైడులో నుంచి తాజ్ మహల్‌ను తొలగించిన విషయంపై వివాదం రాజుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి విమర్శల దాడి అధికమైంది. ఈ న
ఉత్తరప్రదేశ్ సర్కారు తమ రాష్ట్ర పర్యాటక గైడులో నుంచి తాజ్ మహల్‌ను తొలగించిన విషయంపై వివాదం రాజుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి విమర్శల దాడి అధికమైంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు.
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్‌ను జాతికి అంకితం చేసిన సందర్భంగా మోడీ మాట్లాడుతూ... వారసత్వ కట్టడాలను మరిచి ఏ దేశం కూడా ముందుకు వెళ్లలేదన్నారు. ‘చారిత్రక వారసత్వ గౌరవాలను విస్మరించి దేశాలు అభివృద్ధి చెందలేవు. ఒక వేళ అలా చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో తమ గుర్తింపును కోల్పోతారు’ అని చెప్పారు.
అలాగే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించారు. తాజ్ మహల్ భారతీయుల రక్తం, చెమటచుక్కలతో కట్టిందన్నారు. తాజ్ మహల్‌ను ఎవరు, ఏ కారణం కోసం కట్టించారన్నది అనవసరమన్నారు. అయితే అది మన భారతీయ కార్మికుల రక్తం, చెమటతోనే నిర్మించారని.. ఈ నెల 26న తాజ్ మహల్ సందర్శనకు తాను వెళ్తున్నట్లు చెప్పారు.
పర్యాటక కోణంలో చూస్తే ఇది తమకు చాలా ముఖ్యమైనదని, ఇక్కడికి వచ్చే పర్యాటకులకు తగిన వసతులు, భద్రత కల్పించడం తమ బాధ్యత అని యోగి ట్వీట్ చేశారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో ఘనంగా వేడుకలను నిర్వహించబోతున్నామని చెప్పారు.