గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (14:29 IST)

1951 నుంచి వరుసగా ఓటేసిన శతాధిక వృద్ధుడు.. అరుదైన గౌరవం

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలలో నిర్విరామంగా ఓటు వేస్తున్న శతాధిక వృద్ధులు చాలా అరుదుగా కనిపిస్తారు. వారిలో ఒకరు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన శ్యామ్‌ శరణ్ నేగి. అతనికి ఇప్పుడు 102 సంవత్సరాలు. జులై 1న 103వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాడు.  
 
1951లో మొదటిసారిగా ఓటు వేసిన శ్యామ్, అప్పటి నుండి తన ఓటు హక్కును వినియోగించుకుంటూనే ఉన్నారు. రాబోయే ఎన్నికలలో కూడా తప్పకుండా ఓటు వేస్తానని చెబుతున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తానని చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్‌ జిల్లా కల్పా గ్రామానికి చెందిన శ్యామ్‌ శరణ్ 1951లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేసారు. 
 
ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్న శ్యామ్‌ను ఎన్నికల సంఘం ప్రత్యేకంగా గుర్తించింది. 2010లో అప్పటి ఎన్నికల ప్రధాన అధికారి నవీన్‌ చావ్లా శ్యామ్‌ను కలిసి సన్మానించారు. జరగబోయే ఎన్నికలలో ఎన్నికల ప్రచారకర్తగా అయనను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. 
 
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయిన శ్యామ్‌ 1975లో పదవీ విరమణ పొందారు. అతనికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. మనవళ్లు, మనుమరాళ్లు కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా తన పని తానే చేసుకుంటాడని, కళ్లు కూడా బాగా కనిపిస్తాయని అతని కుమారులు చెబుతున్నారు.