ఏమైనా జరగొచ్చు.. సిద్ధంగా వుండండి.. అరుణ్ జైట్లీ.. ఎన్నికలు వాయిదా?
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా.. ఏమైనా జరుగవచ్చునని.. అందుకు భారత్ సిద్ధంగా వుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇండో-పాక్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుకునే పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుత తరుణంలో త్రిదళ సైన్యం సిద్ధం కావాలని అరుణ్ జైట్లీ పిలుపు నిచ్చారు. ఇంకా త్రిదళాల అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య అంతర్జాతీయ విమాన సేవలు రద్దు చేశారు.
ఇదిలా ఉంటే.. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు వాయిదా పడే అవకాశం వుందా అనే చర్చ మొదలైంది. మంగళవారం భారత్.. పాకిస్థాన్ భూభాగంపై వైమానిక దళం ద్వారా 300 మంది ఉగ్రవాదులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్థాన్ ప్రకటించింది. ఇంకా భారత భూభాగంలోకి వచ్చి బాంబును జారవిడిచింది.
కానీ భారత వైమానిక దళం అప్రమత్తం కావడంతో పాకిస్థాన్ తోకముడిచింది. దీంతో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల వద్ద ఏమైనా జరుగవచ్చుననే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతేగాకుండా హైలర్ట్ ప్రకటించారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే.. యుద్ధం జరిగే అవకాశాలు లేకపోలేదనే సంకేతాలు కూడా రావడంతో.. రెండు నెలల్లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడే అవకాశం వుందని టాక్.
మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాల్సి వుండగా... ప్రస్తుతం పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనను వాయిదా వేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఎన్నికల కంటే జాతి భద్రతే ముఖ్యమనే పరిస్థితి నెలకొంది. అందుచేత ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడంపై సబబు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఫలితంగా ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.