మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2020 (07:36 IST)

సుదీర్ఘకాల బాధ ముగిసింది... కుమార్తె ఫోటోను హత్తుకుని....

తన సుదీర్ఘకాల బాధ ముగిసిందంటూ తన కుమార్తె నిర్భయ ఫోటోను హత్తుకున్నానని నిర్భయ తల్లి ఆశాదేవి ఉద్వేగపూరిత స్వరంతో చెప్పుకొచ్చారు. తనకు జరిగిన అన్యాయం మరే తల్లికి జరగకూడదన్నారు. ఇప్పటివరకు తాను చేసిన పోరాటం నిర్భయ కోసమని, ఇకపై మన కుమార్తెల కోసం పోరాటం చేస్తానని ఆమె ప్రకటించారు. 
 
నిర్భయ అత్యాచార కేసులో నలుగురు దోషులకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్షలను తీహార్ జైలులో అమలు చేసిన విషయం తెల్సిందే. ఈ శిక్షల తర్వాత ఈ నలుగురు చనిపోయారని వైద్యులు ధృవీకరించిన తర్వాత ఆశాదేవి మీడియాతో మాట్లాడారు. తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందన్నారు. 
 
నలుగురికీ ఉరితీత పూర్తయిన తర్వాత ఆశాదేవి విజయ చిహ్నం చూపిస్తూ సంతోషంగా కనిపించారు. తన కుమార్తె లేదని, ఇకపై రాదని పేర్కొన్న ఆమె.. కుమార్తెను కోల్పోయిన తర్వాత తాము పోరాటం ప్రారంభించినట్టు చెప్పారు. ఇప్పటివరకు తమ పోరాటం నిర్భయ గురించేనని, ఇకపై 'మన కుమార్తె'ల కోసం పోరాడతానని చెప్పారు. దోషులకు ఉరిశిక్ష అమలు జరిగిన వెంటనే తన కుమార్తె ఫొటోను హత్తుకున్నానని ఆశాదేవి ఉద్వేగపూరిత కంఠంతో చెప్పారు.
 
మొత్తానికి వారికి ఉరిపడిందని పేర్కొన్న ఆశాదేవి.. ఇదో సుదీర్ఘకాల బాధ అని అన్నారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజును దేశంలోని అందరి కుమార్తెలకు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. భారత ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు ఆశాదేవి కృతజ్ఞతలు తెలిపారు.