ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (08:58 IST)

వర్థమాన మోడల్‌ను స్క్రీన్ టెస్టుకు పిలిచి ఆ పని చేసిన మహిళ...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. వర్థమాన మోడల్‌కు మత్తుమందిచ్చిన ఓ మహిళ ఆ యువతిని నగ్నంగా వీడియోలు తీసి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసింది. విభూతిఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మోడల్‌ను స్క్రీన్‌ టెస్టుకు పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తనకు మత్తు మందిచ్చి నగ్నంగా వీడియోలు తీయడమేకాకుండా రూ.5 లక్షల నగదు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ బాధితారులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పైగా, డబ్బు ఇవ్వకుంటే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించినట్టు ఆరోపించింది. 
 
వైష్ణవి ఫిల్మ్ ప్రొడక్షన్స్‌తోపాటు పలు సినిమాలు, మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తానంటూ దియా వర్మ అనే మహిళ బాధితురాలిని కలిసింది. తన మాయలో పడిన బాధితురాలిని తీసుకెళ్లిన దియా.. అనూప్ ఓఝా, వరుణ్ తివారి, ఆయుష్ మిశ్రా, ప్రియా మిశ్రా, సందీప్ విశ్వకర్మలను తన సహచరులుగా చెబుతూ పరిచయం చేసింది.
 
ఆ తర్వాత స్క్రీన్ టెస్టుకు రావాలంటూ ఆమెను గెస్ట్ హౌస్‌కు పిలిపించారు. అక్కడామెకు మత్తమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చారు. అనంతరం ఓ డ్రెస్ ఇచ్చి చేంజింగ్ రూముకు వెళ్లి మార్చుకోవాలని చెప్పారు. అక్కడామె దుస్తులు మార్చుకుంటుంటే వారు రహస్యంగా చిత్రీకరించారు. ఆ తర్వాత ఆ వీడియో చూపించి అసభ్యకర చిత్రాల్లో నటించాలని, లేకుంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు. దీనికి నిరాకరించిన ఆమె ఆ వీడియోలను డిలీట్ చేయాలని కోరింది.
 
అయితే, రూ. 5 లక్షలు ఇస్తేనే వాటిని డిలీట్ చేస్తామన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. తాను డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఓ వీడియోను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారని పేర్కొంది. అప్పటి నుంచి వారు తనను డబ్బుల కోసం వేధిస్తున్నారని ఆరోపించింది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.