అసోంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ : మంత్రి - ముగ్గురు ఎమ్మెల్యేలకు పాజిటివ్
ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. ఫలితంగా ఈ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా అస్సో తాజాగా రాష్ట్ర పర్వత ప్రాంతాల అభివృద్ధి, మైనింగ్ శాఖ మంత్రి సుమ్ రోఘంగ్‌కు కరోనా సోకిందని అధికారులు ప్రకటించారు. అలాగే, మంత్రితోపాటు అధికార పార్టీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధారణ అయ్యింది.
దీంతో కరోనా బారిన పడిన ఎమ్మెల్యేల సంఖ్య 20కి చేరింది. ఇందులో 12 మంది బీజేపీకి చెందినవారు ఉండగా, మరో నలుగురు దాని మిత్రపక్షానికి చెందినవారు, ఏజీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన తొలి మంత్రిగా సుమ్ రోఘంగ్ నిలిచారు.
కాగా, మంత్రితోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆగస్టు 25వ తేదీన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో వారికి పాజిటివ్ వచ్చిందని అధికారులు శనివారం రాత్రి ప్రకటించారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో మరో ఎమ్మెల్యేకు కరోనా నిర్ధారణ అయ్యింది.
అలాగే, మంత్రితోపాటు అతని డ్రైవర్, పీఎస్ఓకి కూడా కరోనా సోకిందని తెలిపారు. అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కూడా కరోనా బారినపడిన విషయం తెల్సిందే. ఆగస్టు 25న ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో మాజీ సీఎం గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.