శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:05 IST)

రాయల్ బెంగాల్ టైగర్‌కు కోరల పదును రూచిచూపించిన అడవిపంది...

సాధారణంగా పెద్దపులి దెబ్బకు ఏ జంతువైనా బలికావాల్సిందే. పులి వస్తున్నట్టు జాడ తెలియగానే ప్రతి పశుపక్షాలు కాలికి పనిచెబుతాయి. కానీ, కజిరంగా అభరాణ్యంలో ఓ అరుదైన ఘటన ఒకటి జరిగింది. రాయల్ బెంగాల్ టైగర్ ఓ అడవి పంది చేతిలో చనిపోయింది. అదేవిధంగా అడవి పంది కూడా మృత్యువాతపడింది. ఈ ఘటన ఎపుడో జరగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు కళేబరాలను అధికారులు గుర్తించి ఆశ్చర్యపోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్ద పులులు అధికంగా ఉండే కజిరంగా అభయారణ్యంలోని కోహోరా ఫారెస్ట్ రేంజి పరిధిలో రెండు జంతువుల కళేబరాలను అధికారులు గుర్తించారు. వాటిలో ఒకటి రాయల్ బెంగాల్ టైగర్ కాగా, మరొకటి అడవిపంది. 
 
దీనిపై అధికారులు వ్యాఖ్యానిస్తూ, ఓ పోరాటంలో పులి, అడవిపంది రెండూ చనిపోవడంతో ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. పెద్దపులి ఉదర భాగంలో తీవ్రగాయాలు కనిపించాయని, అడవిపంది ఒంటినిండా గాయాలేనని కజిరంగా పార్క్ రీసెర్చ్ ఆఫీసర్ రాబిన్ సర్మా తెలిపారు. 
 
తీవ్ర గాయాల కారణంగా ఈ రెండు జంతువులు తాము పోరాడిన స్థలం నుంచి కదల్లేకపోయి ఉంటాయని వివరించారు. కాగా, ఈ రెండు వన్యమృగాలకు పోస్టుమార్టం జరిపిన స్థానిక పశువైద్యులు, నమూనాలను గౌహతి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.