మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (18:42 IST)

మినీ అసెంబ్లీ సమరం : 7న మిజోరం - ఛత్తీస్‌గఢ్ పోలింగ్

mizoram - chhattisgarh
మినీ సమరంగా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మిజోరం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిజోరం అసెంబ్లీ స్థానానికి మొత్తంమ 40 స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ జరగనుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు తొలి విడత పోలింగ్‌ జరగనుంది. 
 
మరోవైపు, సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోలాహలం కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచార జోరును కొనసాగిస్తున్నాయి. రాజకీయ పార్టీలు పోటీపడి మరీ జనాకర్షక హామీలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో నవంబర్‌ 7వ తేదీన మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ (తొలి విడత) రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 3న జరగనుంది.
 
ఇదిలావుంటే, మిజోరంలో మొత్తం 40 నియోజకవర్గాలకు ఒకే విడతలో మంగళవారం పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ మొత్తంగా 8.50 లక్షల మందికి పైగా ఓటర్లు ఉండగా.. వీరిలో 4,13,064 మంది పురుష ఓటర్లు. 4,39,028మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తంగా 1276 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50,611 మంది తొలిసారి ఓటు వేయబోతున్నారు. 
 
మిజోరంలో మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా రాష్ట్రంలో 50 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. థొరాంగ్‌ నియోజకవర్గంలోని తెలెప్‌ పోలింగ్‌ కేంద్రంలో కేవలం 26మంది ఓటర్లే ఉండగా.. జెమాబ్వాక్‌ VIII పోలింగ్‌ స్టేషన్‌లో అత్యధికంగా 1481మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 
 
దాదాపు 5వేల మంది సిబ్బంది పోలింగ్‌ విధులు నిర్వహించనున్నారు. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ తన అధికారాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తుండగా.. జడ్‌పీఎం, భాజపా, కాంగ్రెస్‌లు ప్రస్తుత సర్కార్‌ను గద్దె దించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.  2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్‌ ఫ్రంట్‌కు 26 సీట్లు రాగా.. కాంగ్రెస్‌ ఐదు, భాజపా ఒక సీటు గెలిచాయి. ఈసారి మిజో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి!
 
ఇదిలావుంటే, ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌లో 20 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. మిగతా 70 సీట్లకు రెండో విడతలో ఈ నెల 17న పోలింగ్‌ నిర్వహించనున్నారు. 20 నియోజకవర్గాల్లో ఎన్నికలకు 5,304 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు 60 వేల మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 
 
తొలి దశలో 40,78,680 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 19,93,936మంది పురుషులు కాగా.. 20,84,675మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1,64,299 మంది యువత తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. తొలి విడతలో 223  మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 68 సీట్లతో ప్రభంజనం సృష్టించగా.. భాజపా 15 స్థానాల్లో విజయం సాధించింది.