బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (20:09 IST)

తెలంగాణ ఎన్నికలు : కేసీఆర్ బయోగ్రఫీ... రెండు నియోజకవర్గాల్లో పోటీ ఎందుకు?

kcrao
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడుగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉద్యమ నాయకుడి పక్కా రాజకీయ నేతగా ఎదిగారు. గత తొమ్మిదేళ్లుగా ముఖ్యంత్రిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వేరుపడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి. ఆయనను షార్ట్‌గా కేసీఆర్ అని పిలుస్తారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఉవ్విళ్ళూరుతున్నారు. 
 
మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర గురించి తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ సాధణ కర్తగా.. తెలంగాణ గాంధీగా ఆయన పిలవబడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆయన జీవన ప్రస్తానం గురించి తెలుసుకుందాం....
 
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 17 ఫిబ్రవరి, 1954న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఉస్మానియా వర్శిటీలో ఎం.ఎ తెలుగు లిటరేచర్ పూర్తి చేశారు. ఆయన భార్య శోభా. కేసీఆర్ దంపతులకు ఒక కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత.
 
విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయ అనుభవం సంపాదించిన కేసీఆర్ ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించారు. 1999-2001 ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవికి కూడా నిర్వహించాడు. 
 
ఆ తర్వాత 2001 ఏప్రిల్ 21 నుంచి తాను ఉంటున్న తెలుగుదేశం పార్టీకి డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు.
 
2004 ఎన్నికల్లో తన సొంత పార్టీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు. 14వ లోక్‌సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ కూటమికి మద్దతు ప్రకటించి ఐదు లోక్‌సభ సభ్యులన్న టీఆర్ఎస్ తరపున కేసీఆర్ మంత్రి పదవి చేపట్టారు. 
 
2004 నుండి 2006 వరకు కేంద్రంలో కార్మికశాఖ మంత్రి పదవిని నిర్వహించిన అనంతరం మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో మంత్రిపదవులకు రాజీనామా చేయడమేకాకుండా యూపీఏ కూటమికి మద్దతు ఉపసంహరించి ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. 
 
ఈ క్రమంలో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.జీవన్ రెడ్డిపై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2008లో మళ్లీ రాష్ట్రమంతటా తెరాస సభ్యుల రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి లక్షా 50 వేల పైగా మెజారిటీతో భారీ విజయంతో గెలుపొందారు.
 
2009లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు. ఈ వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ ఆకస్మిక మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు వంటి పరిణమానాలను తనకు అనుకూలంగా మరల్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి పెంచారు. కేసీఆర్ సృష్టించిన వాతావరణంతో ఇక తెలంగాణ రాష్ట్ర ఇవ్వడం తప్పితే మరో మార్గం లేదని భావించిన కేంద్ర ప్రభుత్వం .. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
 
ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగడం.. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2 మధ్యాహ్నం 12.57 కు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇపుడు మూడోసారి కూడా గెలుపొంది ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని భావిస్తున్నారు. 
 
ఇందుకోసం త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు. వీటిలో ఒకటి గజ్వేల్, కామారెడ్డి స్థానాలను ఎంచుకున్నారు. గత 2014లో జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 19391 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే, 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన... 58290 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నరేంద్రనాథ్, ప్రతాప్ రెడ్డి ఒంటేరులుపోటీ చేసి ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయన గజ్వేల్‌తో పాటు కామారెడ్డి అసెబ్లీ స్థానాల నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో నవంబరు 9వ తేదీన ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.