సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2024 (08:46 IST)

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 29కి పెరిగిన మృతుల సంఖ్య... కీలక నేతలు హతం

maoists
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నక్సలైట్ల సంఖ్య 29కి పెరిగింది. ఈ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలోని మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెల్సిందే. కల్పర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సల్స్‌కు మధ్య భీకర స్థాయిలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పలువురు అగ్రనేతలు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, మృతుల్లో డివిజినల్ కమిటీ సభ్యులు శంకర్ రావు, లలితలు ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలంలో ఒక ఏకే 47 తుపాకీ, మూడు లైట్ మెషీన్‌‌గన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరణించిన మావోయిస్టుల్లో శంకర్ రావుపై తలపై రూ.25 లక్షల రివార్డు కూడా ఉంది. శంకర్ రావు, లలిత మావోయిస్టులు పార్టీలో నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యులుగా వ్యవహరించినట్టు సమాచారం. 
 
కాగా, కాంకేర్ జిల్లాలోని బినాగుండ అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), జిల్లా రిజర్వు గార్డ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. అయితే, భద్రతా బలగాలు రాకను పసిగట్టిన మావోలు కాల్పులు ప్రారంభించారు. దీంతో బీఎస్ఎఫ్, డీఆర్జీ దళాలు కూడా ధీటుగా స్పందించి, ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఘటనా స్థలంలోనే 18 మంది ప్రాణాలు కోల్పోగా గాయపడిన వారిలో మరికొందరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 29కు చేరింది. ఇటీవలి కాలంలో ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.