భూమిపూజకు ఆహ్వానితుల జాబితా సిద్ధం : అద్వానీ - జోషీల పేర్లు గల్లంతు?
అయోధ్యలో రామ మందిర నిర్మాణ కల త్వరలోనే సాకారంకానుంది. ఇందుకోసం ఈ నెల ఐదో తేదీన బుధవారం భూమిపూజ జరుగనుంది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చేపట్టి, ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. బుధవారం అయోధ్యలో రామ మందిరం భూమి పూజ జరగనుండగా, ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి.
ఈ చారిత్రాత్మక భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రామ జన్మభూమి న్యాస్ అధిపతి నృత్యగోపాల్ దాస్ ఈ క్రతువులో ప్రధాని మోడీతో కలిసి వేదికపై ఆసీనులు కానున్నారు.
మొత్తమ్మీద ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి 175 మంది ప్రముఖులను, 135 మంది సాధువులను ఆహ్వానించినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. కాగా, ఈ భూమి పూజ కోసం దేశంలోని వేలాది పుణ్యక్షేత్రాల నుంచి పవిత్రమైన మట్టిని, వంద నదుల నుంచి పుణ్యజలాలను సేకరించినట్టు వివరించింది.
అయితే, బీజేపీకీ ఓ ఇమేజ్ తీసుకొచ్చిన వారిలో సీనియర్ నేతలు ఎల్కేఅద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి వంటి వారు ఉన్నారు. ఈ క్రమంలో ఈ భూమిపూజ కార్యక్రమానికి వీరికి ఆహ్వానాలు పంపినట్టు లేదు. పైగా, వీరందరా తమతమ ఇళ్లలో కూర్చొనే భూమిపూజను తిలకించనున్నారనే వార్తలు వస్తున్నాయి.
మరోవైపు, అయోధ్య రామాలయ భూమి పూజ ఉత్సాహం ఢిల్లీ అంతటా కనిపిస్తోంది. అయోధ్య భూమి పూజ ఉత్సవాన్ని చారిత్రాత్మకంగా మార్చడానికి ఢిల్లీలో కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భూమి పూజ ప్రత్యక్ష ప్రసారానికి బీజేపీ రంగం సిద్దం చేసింది. బుధవారం భారీఎత్తున దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఇందుకోసం బీజేపీ కార్యకర్తలు దీపాలను పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 5న ఢిల్లీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయనున్నారు. అయోధ్యలో భూమి పూజ జరిగే క్షణం మనందరికీ చారిత్రాత్మకమైనదని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు ఆదేశ్ కుమార్ గుప్తా అన్నారు.
ఇదిలావుండగా, భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ బీజేపీ అధికారిక సోషల్ మీడియా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఆగస్టు 5 న 500 సంవత్సరాల అయోధ్య పోరాట కల నెరవేరబోతోందని, దేశంలోని ప్రతీఒక్కరూ రామాలయ భూమి పూజను చూడబోతున్నారని రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొన్నారు.