బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (16:18 IST)

కట్నం కోసం భార్య వేధింపులు.. ప్రాణభయంతో భర్త...

ఎక్కడ చూసినా... ఎప్పుడు చూసినా చూడు.. కట్నం కోసం భర్త వేధింపులు. అత్త, ఆడపడుచుల చిత్రహింసలు. ఇలాంటి వార్తలు చదివీ చదివీ.. చూసీ.. చూసీ విసిగిపోయాం. వీళ్లు మారరురా బాబోయ్ అంటూ మగాళ్ల గురించి తిట్టుకునే

ఎక్కడ చూసినా... ఎప్పుడు చూసినా చూడు.. కట్నం కోసం భర్త వేధింపులు. అత్త, ఆడపడుచుల చిత్రహింసలు. ఇలాంటి వార్తలు చదివీ చదివీ.. చూసీ.. చూసీ విసిగిపోయాం. వీళ్లు మారరురా బాబోయ్ అంటూ మగాళ్ల గురించి తిట్టుకునే మహిళలు కూడా ఉన్నారు. ఇదంతా గతం. ఇపుడు సీన్ రివర్స్ అయింది. కట్నం తేవాలంటూ తాళి కట్టించుకున్న భార్యే భర్తను వేధిస్తోంది. అంతేనా రోజూ భర్తను చిత్రహింసలు పెడుతోంది. భయపెడుతోంది. రాసిరంపాన పెడుతోంది. ఈ భార్య వేధింపులు, చిత్రహింసలు తాళలేక ఆ భర్త ప్రాణభయంతో వణికిపోతూ పోలీసులు ఆశ్రయించాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. కేసు కూడా నమోదైంది. ఈ ఘటన పూర్తి వివరాలను పరిశీలిస్తే..
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధీరజ్ రెడ్డి అనే వ్యక్తి బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మంచి జీతం.. హోదా ఉన్నాయి. బాగా డబ్బు కూడా ఉంది. దీంతో భారీ లాంఛనాలతో యేడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. మొదటి నెల హ్యాపీ.. ఆ తర్వాత భార్య అసలు రంగు బయటపడింది. డబ్బు, డబ్బు అంటూ వేధించటం మొదలుపెట్టింది. 
 
మొదట్లో భార్య కోరిక తీర్చటం కోసం అప్పులు చేసి మరీ కొనిచ్చాడు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. ఇటీవల భార్య డైమండ్ నెక్లెస్ కొనివ్వమని కోరింది. దాని విలువ రూ.30 లక్షలు. అంత డబ్బు లేదని చెప్పటంతో వేధింపులు మొదలయ్యాయి. డబ్బులు ఇస్తావా.. కట్నం వేధింపుల కింద కేసు పెట్టమంటావా? అంటూ టార్చర్ పెట్టడం మొదలెట్టింది. 
 
తనకు తానుగా వాతలు పెట్టుకుని.. చిత్రహింసలు పెడుతున్నావ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరించసాగింది. తాజాగా, మా చెల్లి పెళ్లి కోసం రూ.40 లక్షలు ఇవ్వాలంటూ చేయి చేసుకునే స్థాయికి వెళ్లింది. అంతేనా.. నిన్ను చంపేస్తా.. ఆ తర్వాత ఆస్తి మొత్తం నాకే కదా అంటూ వార్నింగ్స్ కూడా ఇచ్చింది. కట్నం వేధింపులు భరించలేని ధీరజ్ రెడ్డి.. బెంగళూరులోని మహాదేవపురం పోలీసులను ఆశ్రయించి, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. 
 
ధీరజ్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు షాకయ్యారు. పైకీ కిందకీ ఎగాదిగా చూశారు. అతను చెబుతున్న విధానం, చూపించిన సాక్ష్యాలు చూసి పోలీసులు భార్య, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. కేసు విచారణ జరుపుతున్నారు.