బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 30 మార్చి 2021 (17:02 IST)

పెళ్లికాని ప్రసాదులే ఆమె టార్గెట్, పెళ్లంటుంది, రమ్మంటుంది ఆ తర్వాత...

దేశంలో పెళ్లికాని ప్రసాదులు ఎక్కువైపోతున్నట్లు పలు సర్వేలు చెపుతున్నాయి. కారణాలు ఏమయితేనేం... పెళ్లికాని యువకుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అలాంటివారు పెళ్లికోసం తహతహలు మామూలే. దీన్ని ఆసరా చేసుకుని కొంతమంది వీరిని బోల్తా కొట్టించి డబ్బులు వసూలు చేసుకుని ఉడాయిస్తున్నారు.
 
ఇలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో చోటుచేసుకుంది. ఎన్నాళ్లకో ఆ యువకుడికి నచ్చిన అందమైన అమ్మాయి తారసపడింది. ఇద్దరూ మాట్లాడుకున్నారు. మంతనాలు సాగించారు. ఇక పెళ్లే తరువాయి కావడంతో కాబేయే భార్యతో సదరు యువకుడు సరదాలు, షికార్లు చేశాడు. వేలల్లో డబ్బు ఆమెకి ముట్టజెప్పాడు. రేపే మన పెళ్లి అని చెప్పింది. కళ్యాణ మండపం సిద్ధం చేసాను, పెళ్లి కొడుకువై వచ్చేయమంది.
 
ఇంకేం... ఆమె చెప్పినట్లుగా పెళ్లికొడుకుగా మారిపోయి బంధువర్గంతో ఆమె చెప్పిన కళ్యాణమండపానికి వెళ్లాడు. తీరా అక్కడికెళ్తే గేటుకు తాళం వేసి వుంది. అక్కడ వున్నవారిని అడిగితే తమకు ఎలాంటి మ్యారేజ్ బుకింగ్స్ లేవని చెప్పారు. వెంటనే సదరు యువతికి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచాఫ్.
 
అంతే తను మోసపోయానని తెలుసుకుని వెంటనే పోలీసు స్టేషనుకు వెళ్లాడు. అక్కడ తనలాగే మరో నలుగురు ఫిర్యాదు చేసేందుకు కూర్చున్నారు. వారూ పెళ్లికొడుకులే. విచారిస్తే వాళ్లను చేసుకుంటానన్న యువతి కూడా ఆమే. అలా మొత్తం ఐదుగురు పెళ్లికాని యువకులను బోల్తా కొట్టించిన ఆ యువతితో పాటు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు.