బీహార్‌లో ఎన్నికల నగారా... శానిటైజర్లు, గొడుగులు, మాస్కులు సిద్ధం
బీహార్‌లో ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం బిహార్‌లో జేడీయూ, భాజపాతో కలిపిన ఎన్‌డీయే కూటమి అధికారంలో ఉంది. జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈసారి కూడా ఎన్‌డీఏ నుంచి సీఎం అభ్యర్థిగా బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. ఇక భాజపా, జేడీయూతో తలపడేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ సిద్ధమవుతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరుగునున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. అక్టోబర్ 28న తొలిదశలో 71 స్థానాలకు, నవంబరు 3న రెండో దశలో 94 స్థానాలకు, నవంబరు 7న మూడో దశలో 78 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక నవంబరు 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. శుక్రవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా సునీల్ అరోరా మాట్లాడుతూ.. గణాంకాల పరంగా చూస్తే మహమ్మారి విజృంభణ సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఇదే అతిపెద్దదని తెలిపారు. రోజులు గడుస్తున్నా మహమ్మారి విజృంభణ అదుపులోకి వస్తున్న సంకేతాలేవీ కానరాలేదన్నారు. దీంతో ప్రజలకు వారి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునే అవకాశం ఎలాగైనా కల్పించాలని నిర్ధారణకు వచ్చామన్నారు.
అదే సమయంలో ఎన్నికల్ని సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ఏడు లక్షల శానిటైజర్ యూనిట్లు, 46 లక్షల మాస్కులు, ఆరు లక్షల పీపీఈ కిట్లు, 23 లక్షల జతల చేతి తొడుగులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఓటర్ల కోసం ఒకేసారి వాడి పడేసే 7.2 కోట్ల చేతి తొడుగులు అందించనున్నామన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో రద్దీ తగ్గించేలా ఓటింగ్ సమయాన్ని గంటపాటు పెంచామన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటును నమోదు చేయొచ్చునని తెలిపారు. అయితే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఇది అమలు కాదని స్పష్టం చేశారు. కొవిడ్-19 బాధితులు ఓటింగ్ చివరి రోజు తమ పోలింగ్ బూత్‌లో ఓటు నమోదు చేయొచ్చని అరోరా ప్రకటించారు.